మేకపాటి గౌతంరెడ్డి భార్యకు నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఆమెనే నిలబెట్టాలని జగన్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మేకపాటి గౌతంరెడ్డి భార్య పేరు శ్రీకీర్తి. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. మేకపాటి కుటుంబం కూడా శ్రీకీర్తికి రాజకీయాలు అంటే ఇష్టం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. గౌతం రెడ్డి పిల్లలు ఇంకా చిన్నవారే. దాంతో పోటీ చేసే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఆత్మకూరు నుంచి ఎవరిని నిలబెట్టాలన్నదానిపై మేకపాటి కుటుంబంలోనే చర్చ జరిగింది. మేకపాటి రాజమోహన్ రెడ్డితోపాటు ఆయనకు ఉన్న మరో ఇద్దరు కుమారులపై చర్చ జరిగింది. అయితే రాజమోహన్ రెడ్డి వయోభారం కారణంగా జగన్ ఆసక్తి చూపించలేదు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రాజకీయాలపై ఆసక్తి ఉన్నా.. ఇది సరైన సమయం కాదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మేకపాటి గౌతంరెడ్డి సంతాపసభకు వెళ్లిన జగన్… రాజకీయ వారసత్వంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో జగన్ ఏమనుకుంటున్నారో అన్న చర్చ జరిగింది. అయితే.. జగన్ మంత్రివర్గ కూర్పు కోసం కసరత్తు చేసినప్పుడు శ్రీకీర్తిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. దీంతో పదకొండో తేదీన జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఆమెకు పదవి లభించడం ఖాయమని చెబుతున్నారు.