ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలు పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేశారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. పదవులకు రాజీనామా చేసిన తరువాత, ఓ వారం పదిరోజులపాటు అలాంటి భారీ ఎత్తు ప్రచారమే సదరు ఎంపీలకు దక్కింది. కానీ, తరువాత…? వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. ఇంతకీ వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్ ఏం సాధించారనేది ప్రశ్నగా మిగిలిపోయింది! ఏదేమైనా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేసిన ఆ ఎంపీలను వైకాపా నెత్తిన పెట్టుకోవాలి కదా. కానీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ మధ్య తీవ్ర అసంతృప్తికి గురౌతున్నట్టు మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. వైకాపా పార్టీ పెట్టిన కొత్తలో ఆయన టాప్ త్రీలో ఉండేవారు. ఆ తరువాత, విజయసాయి రెడ్డి క్రియాశీలత పెరిగేసరికి.. రానురానూ ఆయన్ని పక్కనపెట్టేశారనే అభిప్రాయం ఉండనే ఉంది. ఇప్పుడు వైకాపాలో ఏకంగా మేకపాటి వర్గాన్నే పక్కనపెట్టేస్తున్నారనే అసంతృప్తి మొదలైందని వినిపిస్తోంది…!
ఈ మధ్యనే ఆనం రామనారాయణ రెడ్డి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనా నెల్లూరు జిల్లాకు చెందినవారే కదా! వాస్తవానికి, ఆనం చేరిక మేకపాటి వర్గానికి మొదట్నుంచీ మింగుడు పడటం లేదు. అందుకే, ఆనం పార్టీలో చేరిక కార్యక్రమానికి వైకాపా కీలక నేతలంతా హాజరైనా… మేకపాటి కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ కనిపించింది లేదు! అంతేకాదు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆనం చకచకా చక్రం తిప్పే పనిలోపడ్డారని తెలుస్తోంది. వెంకటగిరి టిక్కెట్ ఆనం ఇస్తారనీ, దీంతోపాటు ఆత్మకూరు అసెంబ్లీ సీటు, నెల్లూరు ఎంపీ స్థానంపై కూడా ఆనం కన్నేశారనీ వినిపిస్తోంది. ఈ స్థానాల్లో తన వర్గానికి చెందినవారికే టిక్కెట్లు దక్కేలా పావులు కదపడం మొదలుపెట్టేశారట!
దీంతో మేకపాటి వర్గం గుర్రుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మేకపాటి వర్గం నుంచి వ్యతిరేకత ఖాయమనీ, ఇప్పటికే ఆనం చేరికతో నివురుగప్పినట్టు ఉన్న అసంతృప్తి బయటపడటం తప్పదనేది కొంతమంది అభిప్రాయం. దీనికి తోడు ఆనం చేరిన తరువాత మేకపాటి వర్గానికి పార్టీ అధినాయకత్వం కూడా ప్రాధాన్యత తగ్గిస్తున్న పరిస్థితి ఉందనే ప్రచారమూ వినిపిస్తోంది. పార్టీ నమ్ముకుని రాజమోహన్ రెడ్డి పదవిని కూడా వదిలేసుకున్నారనీ, అయినా గుర్తింపు దక్కలేదనీ, గతంలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన గౌతమ్ రెడ్డిని కూడా ఈ మధ్య దూరం పెడుతున్నట్టుగా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు సంకేతామనేది ఆ వర్గంలో జరుగుతున్న చర్చ. ఏదేమైనా, సీట్ల కేటాయింపు వరకూ వచ్చేసరికి మేకపాటి వెర్సెస్ ఆనం వర్గాల మధ్య పొరపొచ్చాలు తప్పవనే వాతావరణం ప్రస్తుతానికి కనిపిస్తోంది.