నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి చేసిన మాఫియా వ్యాఖ్యలు కలకలం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా.. మాజీ ఎంపీ మేకపాటి రెడీగా ఉన్నారని అంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడికి మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆ పదవి.. మరో ఏడాదిన్నర మాత్రమే ఉంటుందంటున్నారు. అదే సమయంలో.. రాజమోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ మధ్యనే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి రాజ్యసభ హామీ ఇచ్చారు. దీనిపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారనే చర్చలు సాగుతున్నాయి.
వాస్తవానికి రాజమోహన్ రెడ్డి చాలా సీనియర్ ఎంపీ… 85లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచాక మళ్లీ రాజకీయంగా వెనుదిరిగి చూడలేదు. 89, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రాజకీయ చక్రం తిప్పారు. జగన్ చెప్పిన వెంటనే రెండుసార్లు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అన్నింటికీ మించి జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు.. ఆ పార్టీ మేకపాటి వారికి గొప్ప ఆఫర్లే ఇచ్చింది. కేవలం జగన్ కోసం కాదనుకున్నారు. ఇంతా చేస్తే… గత ఎన్నికలప్పుడు రాజమోహన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వలేదు. ప్రస్తుతం మస్తాన్ రావుకి రాజ్యసభ ఇస్తామని పార్టీలో చేర్చుకోవడంతో మేకపాటిలో అసహనం మొదలైందని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది.
అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఇప్పుడు ఎవర్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆనంకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు కానీ.. అది పైకి మాత్రమే. తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆనం వచ్చి మాట్లాడితే… చెప్పినవన్నీ విన్నారు. అంతా సద్దుమణిగిందని.. ప్రచారం చేశారు. కానీ.. ఆనంకు పార్టీలో ప్రాధాన్యం ఇక ఉండదని.. నెల్లూరు వైసీపీ వర్గాలు చెబుతున్నారు. మేకపాటి కూడా గళమెత్తితో వైసీపీలో కలకలం రేగడం ఖాయమంటున్నారు.