హైదరాబాద్: ప్రత్యకహోదాపై ఆలస్యంగా మేలుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు బాగానే ఉద్యమిస్తున్నారు. ఇవాళ లోక్‌సభలో ఈ అంశంపై యాగీ చేసి మొత్తానికి సభ దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. మొదట ప్రత్యేకహోదాపై వాయిదాతీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యలు ప్లకార్డులు పట్టుకుని పోడియాన్ని చుట్టుముట్టి ప్రత్యేకహోదా కోరుతూ నినాదాలు చేశారు. రాజ్‌నాథ్ దీనిపై సమాధానం ఇవ్వటంతో వైసీపీ సభ్యులు సీట్లలోకి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఈ అంశంగురించి వైసీపీ సీనియర్ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, కేంద్రం ఆదుకోవాలని అన్నారు. తమను ప్రజలు ఎక్కడకెళ్ళినా ఇదే అంశంపై అడుగుతున్నారని, తాము ముఖం చూపించుకోలేకపోతున్నామని చెప్పారు. ప్రత్యేకహోదా సాధించలేకపోతే ప్రజలు తమను క్షమించరని అన్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పునాదులదగ్గరనుంచి నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ అంశంపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధాని లోక్‌సభలో దీనిపై గతంలో హామీ ఇచ్చారని, ఎన్డీఏ కూటమి తమ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిందని మేకపాటి చెప్పారు. కేంద్రప్రభుత్వం దీనిపై స్పష్టంగా, వివరంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంమీద, రాజకీయాలను పక్కన పెడితే ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ గళాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించటంలో మేకపాటి కృతకృత్యులయ్యారని చెప్పాలి. ఆయన వాదనలో నిజాయితీ, ఆవేదన కనిపించింది.
మరోవైపు మేకపాటి తర్వాత మాట్లాడిన తెలుగుదేశం ఎంపీ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించారు. తమపార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకహోదాకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, వైసీపీ కలిసిరావటంలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై గతంలో హామీ ఇచ్చికూడా ఇప్పుడు మాట్లాడటంలేదని అన్నారు. వైసీపీ ఇప్పటికైనా దీనిపై మాట్లాడటం సంతోషమని అన్నారు.