పెగాసస్ అంశంపై తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూండటంతో ప్రెస్ మీట్ పెట్టి తనకేం సంబంధం లేదని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పుకున్నారు. అయితే అలా చేయడం ప్రభుత్వానికి కోపం వచ్చింది. వెంటనే ఆయనకు మెమో జారీ చేసింది. సీఎస్ పేరుతో జారీ అయిన మెమోలో .. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించారని అందులో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
నిజానికి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ ప్రత్యేకంగా తీసుకునే చర్యలేమీ మిగిలి లేవు. చివరికి అరెస్ట్ చేయాలని కూడా అనుకున్నారు. ఎలాగో న్యాయస్థానం నుంచి రక్షణ పొందారు. ఆయనపై ఎన్నెన్నో అభియోగాలు ప్రచారం చేశారు. దేశద్రోహం చేశారన్నారు. కానీ ఆయనపై నిజంగా దాఖలు చేసిన చార్జిషీట్లో అవేమీ లేవు. ప్రస్తుతం ఆయనపై అభియోగాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అదే సమయంలో ఆయనను సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసింది. అదేమయిందో తెలియదు. కొత్తగా ప్రభుత్వం తీసుకునే చర్యలేమీ లేవు.
ఆయనకు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జీతం ఇవ్వడం లేదు. ఇటీవల రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. ఇక తన సస్పెన్షన్ పొడిగింపు కోసం కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వలేదని తన పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. అలాగే తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై పరువు నష్టం దాఖలు చేసేందుకు అనుమతి కావాలని సీఎస్‌కు లేఖ రాశారు. వాటిపై సీఎస్ స్పందించలేదు. కానీ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ మెమో జారీ చేశారు.