ఎందుకనో.. మన టాలీవుడ్ వాళ్ల గొప్ప వాళ్ల మరణాల్ని లైట్ తీసుకుంటోందనిపిస్తోంది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఒక్క సంస్మరణ సభ కూడా నిర్వహించలేదు. ఎందుకంటే.. కరోనా.. బయటకురావడం కష్టం అన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కోసం ఒక్కటంటే ఒక్క సంస్మరణ సభ కూడా నిర్వహించలేదు. ఇప్పుడు కరోనానే కారణంగా చూపిస్తారా?
మన సినిమా రిలీజ్లూ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లూ జరిగిపోతున్నాయి. జనాలు గుంపులు గుంపులుగా థియేటర్లకు రావాలని కోరుకుంటున్నారు. అంటే.. కరోనా భయాలు లేనట్టే కదా? అయినా శాస్త్రి గారి సంస్మరణ సభని నిర్వహించకపోవడం ఏమిటి? ఫిల్మ్ ఛాంబర్ గానీ, `మా`గానీ, దర్శకుల సంఘం గానీ ఇప్పటి వరకూ దీనికి పూనుకోలేదు. కారణం తెలీదు.
ఇలాంటి కార్యక్రమాల్ని నడిపించడానికి ఓ వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి మొన్నటి వరకూ దాసరి రూపంలో ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు. పెద్ద వాళ్లని సంస్మరించుకోవడం కూడా టైమ్ వేస్ట్ వ్యవహారం అయిపోయింది. సిరివెన్నెల చిన్నా చితకా వ్యక్తి కాదు. ఆయనచనిపోయినప్పుడు `మా ఇంట్లో వాడే పోయారు` అనే రేంజ్లో ఒకొక్కరూ బాధ పడిపోయారు. వాళ్లంతా ఓ చోట చేరి, శాస్త్రి గారిని తలచుకోవడం, ఆయనకు నివాళులు అర్పించడం కనీస కర్టెసీ కదా.? ఇది వరకు చిత్రసీమలో ఎవరు చనిపోయినా…వాళ్లకు సంబంధించి నివాళి కార్యక్రమం ఒకటి ఉండేది. అది సంప్రదాయంగా చాలా కాలం కొనసాగింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది.