ప్రపంచకప్ అంటే.. ప్రపంచకప్. అదీ కూడా మన దేశంలో జరుగుతోంది.కానీ పట్టించుకుంటున్న వారే లేరు. మన దేశంలో క్రికెట్ తర్వాత అత్యధికంగా ఆదరణ ఉన్న క్రీడ హాకి. ఒకప్పుడు హాకీకే దేశవ్యాప్తంగా ఆదరణ ఉండేది. కానీ రాను రాను తగ్గిపోయింది. ఇటీవల ఇండియా హాకీ టీం మళ్లీ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతో ఒక్క సారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సమయంలో ప్రపంచకప్ హాకీని నిర్వహించడానికి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆసక్తి చూపించడమే కాదు. .. ఘనంగా నిర్వహిస్తున్నారు కూడా.
భువనేశ్వర్ , రూర్కెలా వేదికలుగా హాకీ ప్రపంచకప్ సంగ్రామం ప్రారంభం అయింది. రెండ్రోజుల ముందే ప్రారంభోత్సవ వేడుకలు సీఎం నవీన్ పట్నాయక్ నిర్వహించారు. కన్నుల పండువగా ఇవి సాగాయి. ప్రపంచ కప్ ఆడేందుకు క్వాలిఫై అయిన 16జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరనుండగా.. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్ఓవర్ పోటీల్లో గెలిచి నాకౌట్‌కు చేరాల్సి ఉంటుంది. 22, 23న క్రాస్ ఓవర్, 24న క్వార్టర్స్, 27న సెమీఫైనల్స్, 29న ఫైనల్ పోటీలు జరగనున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 2018 ఛాంపియన్ బెల్జియం రెండోస్థానంలో ఉంది. భారతజట్టు 6వ ర్యాంక్‌లో ఉంది.
అయినా ఒడిషాలో జరుగుతున్న హాకీ ఈవెంట్‌ను ఏదో దేశ స్థాయి ఈవెంట్ అన్నట్లుగా ట్రీట్ చేస్తున్నారు. ప్రపంచకప్ అనే స్థాయికి తగ్గట్లుగా ప్రచారం ఇవ్వడం లేదు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రచార ఆర్భాటాలకు దూరం. హాకీకి ఉన్న ఆదరణతో ప్రచారం వస్తుందని ఆయన ఆశించి ఉంటారు. కానీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియా .. ప్రచారం ఇవ్వాలంటే.. కొన్ని ప్రమాణాలు పెట్టుకుంది.ఈ ప్రమాణాలను ఒడిషా సర్కార్ అందుకోలేకపోయినట్లుగా కనిపిస్తోంది.
పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా.. క్రీడలపై రూపాయి ఖర్చు పెట్టడం దండగ అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒడిషా ప్రపంచకప్ టోర్నీని ఒంటి చేత్తో నిర్వహించడానికి ముందుకు వచ్చింది. సీఎం నవీన్ పట్నాయక్ కు ఈ విషయంలో అభినందనలు చెప్పాల్సిందే.