Mercury movie review
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
పేజీలో చెప్పాల్సిన భావాన్ని ఒక్క మాటలో చెప్పాడంటే.. `అరె భలే చెప్పాడ్రా` అంటాం. అలాంటిది ఆ ఒక్క మాట కూడా లేకుండా సినిమా తీయాలంటే – నిజంగా అద్భుతం.. అపురూపం. ఆ అద్భుతం `పుష్షకవిమానం`తో ఆవిష్క్రృతమైంది. మూకీ సినిమా తీయాలంటే తెగింపు, ధైర్యం చాలవు. `మాట` చొరబడలేని స్క్కిప్ట్ కావాలి. అలాంటి కథ, అలాంటి సన్నివేశాలు రాసుకోవడానికి తెలివితేటలుండాలి. పుష్షక విమానం వచ్చి 30 ఏళ్లయినా మళ్లీ ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదంటే కారణం… ఏమిటి? అలాంటి గొప్ప స్క్రిప్టు రాసుకోలేక. అయితే… కార్తీక్ సుబ్బరాజుకి మాత్రం ఆ ఆలోచన వచ్చింది. `పుష్షక విమానం`లాంటి ఓ పర్వతం దూరం నుంచి తనని భయపెడుతున్నా.. `నేనూ మూవీ సినిమా తీస్తా` అని ప్రయాణం మొదలెట్టాలంటే.. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. పుష్షక విమానంలా… మెర్క్యూరీ కూడా ఓ మూకీనే. మరి ఈ ప్రయత్నంలో తాను విజయం సాధించాడా, లేదా?? మాటలు లేకుండా ఓ కథని ఎలా రక్తి కట్టించగలిగాడు?
కథలోకి వెళ్తాం. చాలా సింపుల్‌గా ఓ ఆత్మ… తనని చంపినవాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడమే లైన్. ఇలాంటి కాన్సెప్టులు చాలా చాలా చూశాం. రెగ్యులర్ రివైంజ్ స్టోరీ. కాకపోతే… చంపినవాళ్లకు మాటలు రావు, వినపడదు. వెంటాడుతున్న ఆత్మకు కళ్లు కనిపించవు. అందుకే వాళ్ల మధ్య మాటల అవసరం లేకుండా పోయింది. ఓ పాడుపడ్డ ఫ్యాక్టరీలో వీళ్లంతా ఎలా దాగుడుమూతలు ఆడారు, ఆ దెయ్యం చేతికి ఎలా చిక్కారు? ఎవరు మిగిలారు.. అనేదే కథ
మాటలు లేకుండా ఓ సినిమా తీయాలి.. అని గట్టిగా ఫిక్సయి, అందుకు అక్షరాలా తగిన బ్యాక్ గ్రౌండ్ ఎంచుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఏ పాత్రకూ నోరు ఇవ్వకుండా.. ఒకవేళ ఇచ్చినా మాటలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. పుష్షక విమానం గొప్పదనం ఏంటంటే.. అందులో ఎవ్వరూ మూగవాళ్లు కాదు. హాయిగా మాట్లాడగలిగేవాళ్లే. వాళ్ల మధ్య కథ నడుపుతూ.. ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం, అవసరం లేకుండా సినిమా మొత్తం నడిపాడు. ఇక్కడ మాత్రం అలా కాదు. అందరినీ మూగవాళ్లు చేసేశాడు. అలాంటప్పుడు ఇది మూకీ సినిమా ఎలా అవుతుంది..? ఓ మూగ సినిమా తప్ప??
కాకపోతే… ఎమోషన్స్ పండించడానికి దర్శకుడికి మూగ, చెవిటి, గుడ్డి అనే అంశాలూ బాగా దోహదం చేశాయి. ఆత్మకు కళ్లు కనిపించవు.. అది తనని హతమార్చిన శత్రువుల కోసం అన్వేషిస్తుంటుంది. ఆత్మకి దొరక్కుండా, చిటుక్కుమనే శబ్దం కూడా చేయకుండా.. తప్పించుకొనే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న సన్నివేశాలు బాగా వచ్చాయి. ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్న ఎపిసోడ్లు అవే.
స్నేహితుల బృందం అనుకోకుండా చేసిన ప్రమాదం.. శవం మాయం అవ్వడం… వీటిపైనే తొలి అర్థభాగం నడిచింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి ఫస్టాఫ్‌లో ఎక్కడా చోటు దక్కలేదు. మూగ ప్రేమ, వాళ్ల సైగలు.. తొలి 45 నిమిషాలూ చూపించింది అదే. ఇక్కడే… ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. స్క్రీన్‌పై ప్రభుదేవా కనిపించి – గట్టిగా అరిచే వరకూ కదలిక రాదు. అక్కడ ఇంట్రవెల్ పడిపోతుంది. ద్వితీయార్థం మొత్తం దాగుడు మూతలే. అక్కడక్కడ కార్తీక్ సుబ్బరాజు పనితనం, కెమెరా వర్క్, రీరికార్డింగ్.. ఇవి మూడూ కలగలిపిన సన్నివేశాలు మాత్రం రక్తికడుతూ, ఊపిరి బిగబెట్టేలా చేస్తాయి. కాకపోతే థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన లక్షణాలేం మెర్క్యూరీ ఫాలో అవ్వలేదు. దెయ్యం ఆత్మ రూపంలో మారి ఎవరి శరీరంలోనైనా సరే ప్రవేశిస్తుంది అని చూపించారు. కానీ అదే దెయ్యం కుంటుంతూ… తనని చంపిన వాళ్లని గుడ్డిగా వెదుక్కోవడం చూపించారు. ఇలా దెయ్యాలకు కూడా వాయిదాల పద్ధతిలో అతీత శక్తులు ఇవ్వడం ఎందుకో..?
పతాక సన్నివేశాల్లో ఉన్న ఎమోషన్ నచ్చుతుంది. ఈ కథని ముగించిన విధానం కూడా బాగుంది. మూకీ నేపథ్యం ఎంచుకోకపోతే.. అసలు కార్తిక్ సుబ్బరాజు, ప్రభుదేవా కలసి ఈ సినిమా ఎందుకు తీశారబ్బా?? అనుకోవాలి.
ప్రభుదేవాలోని మరో యాంగిల్ ఇది. డాన్సులు చేయడమే కాదు, గట్టిగా అరవగలను అని కూడా నిరూపించాడు. చెవులు రిక్కరించి, శబ్దాల ఆధారంగా తన శత్రువులను అన్వేషించే క్రమంలో అతని నటన మరింత బాగుంది. మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. కాకపోతే అందరూ బాగానే చేశారు. టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. ఈ కథ కోసం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్ నచ్చుతుంది. సగం సినిమా ఫ్యాక్టరీలోనే తీసేశారు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం హడలెత్తిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే.. మూకీ సినిమా అనగానే పుష్షక విమానం మాత్రమే గుర్తొస్తుంది. అలాంటి శిఖరంతో పోలుస్తారని తెలిసినప్పుడు మరింత జాగ్రత్తగా సినిమా తీయాల్సింది.
ఫినిషింగ్ టచ్: మూకీ సినిమా కాదు… మూగ సినిమా
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5