సినిమా సినిమాకీ తన సర్కిల్ నీ, రేంజ్నీ, బడ్జెట్ నీ పెంచుకొంటూ పోతున్నాడు కిరణ్ అబ్బవరపు. నిన్నా మొన్నటి వరకూ లవ్ స్టోరీలు చేసిన కిరణ్.. ఇప్పుడు మాస్ బాట పట్టాడు. అందులో భాగంగా చేసిన సినిమానే `మీటర్`. టైటిల్ కి తగ్గట్టుగానే మాస్ మీటర్లో సాగే సినిమా ఇది. దర్శకులు, నిర్మాతలు కూడా ఇదే ముక్క గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్లోనూ అదే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.
ఏప్రిల్ 7న విడుదల అవుతున్న సినిమా ఇది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వదిలారు. 2 నిమిషాల 18 సెకన్ల ఈ ట్రైలర్లో మాస్ జపం కనిపించింది. కిరణ్ తొలిసారి పోలీస్ గెటప్ లో దర్శనమిస్తున్నాడు. పోలీస్ కథలంటే మాస్, యాక్షన్లకు పెద్ద పీట వేస్తారు కదా? ఇక్కడా అదే జరిగింది.
చేత్తో కొట్టావా? ఫ్లవర్ తో కొట్టావా, ఇంత సున్నితంగా ఉంది..
గంప దాటిన కోడి పిల్ల.. గడప దాటిన ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
అది దొరికితే బిర్యానీ అవుతుంది.. నువ్వు దొరికితే బత్తాయి అవుతావు…
లాంటి సరదా డైలాగులతో ట్రైలర్ ప్రారంభమైనా, ఆ వెంటనే మాస్ రూట్ లోకి వెళ్లిపోయింది.
భగవంతుడు ముందు భక్తితోనూ
బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి.. అంటూ విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు.
“కుర్రనాకొడుకును.. దింపడం అంటూ మొదలెడితే. ఎంత లోతుకు దింపుతానో నాకే తెలీదు…“ అంటూ హీరో విలన్ గ్యాంగ్ కు వార్నింగ్ ఇవ్వడం ఈ సినిమా ఏ మాస్ మీటర్ లో వెళ్తోందో చెప్పకనే చెప్పేస్తుంది.
మధ్యమధ్యలో.. కిరణ్ నుంచి ఆశించే.. ఫన్, రొమాన్స్, కామెడీ టచ్… ఇవన్నీ కనిపించాయి. ఈ సినిమా హిట్టయితే… కిరణ్ అబ్బవరం మాస్ హీరోగా నిలబడిపోవడం ఖాయం. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.