హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిగలో మరో రెండు కలికి తురాయిలు చేరాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రాజెక్ట్లు ఖరారయ్యాయి. ఢిల్లీకి చెందిన డీఎమ్ఆర్సీ సంస్థ ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లను ఇవాళ విజయవాడలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సమర్పించింది. విజయవాడలో 26.03 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 42.55 కిలోమీటర్లు మెట్రో మార్గాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు, విశాఖపట్నంలో తాటిచెట్లపాలెంనుంచి చినవాల్తేరు వరకు మెట్రో మార్గాలు ఉంటాయని వెల్లడించారు. విజయవాడ ప్రాజెక్టుకు రు.6,769 కోట్లు, విశాఖ ప్రాజెక్టుకు రు.12,727 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, విభజనచట్టంలో పేర్కొన్నమేరకు విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. వాస్తవానికి 20 లక్షల జనాభా ఉంటేనే మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేయాలని, అయితే నిబంధనలను సడలించి ఈ ప్రాజెక్టులను మంజూరు చేశామని పేర్కొన్నారు. 2018 నాటికి రెండు ప్రాజెక్టులూ పూర్తవుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్లను డీఎమ్ఆర్సీ సంస్థ అందజేసే కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కోరినందున వచ్చానని చెప్పారు. ఢిల్లీ మెట్రో ప్రతినిధి శ్రీధరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.