వానాకాలంలో పొంగి ప్రవహించే వరద నీటిని మళ్ళించి సద్వినియోగం చేసుకోగలగడమే జలయజ్ఞం. కరువుకాటకాలతో తల్లడిల్లే పుడమితల్లిపై స్వచ్ఛ జలాలు ప్రవహింపజేయడం ఓ పరమక్రతువు. ఇలాంటి క్రతువును అలనాడు భగీరథుడు చేశాడు. ఆకాశంలోఉన్న గంగను తన తపస్శక్తితో భూమికి దింపి, తాను కోరుకున్నట్టు రీతిలో పుణ్యగంగామాతను నడిపించాడు. మార్గమద్యంలో వచ్చే వాగులూ, వంకలను కలుపుకుంటూ గంగానది సాగింది. దీంతో కరువుకాటకాలు తొలిగిపోయి పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇంతటి భగీరథుని సంకల్పానికి మూలశక్తి మహాగణపతి మంత్రమే. యజ్ఞం తలపెట్టినా, క్రతువు ప్రారంభించినా ఆ శివపుత్రుడిని ధ్యానించాల్సిందే. భగీరథుని ప్రయత్నం విజయవంతం కావడంవెనుక వ్యూహకర్త, మూలపురుషుడు నిశ్చయంగా మహాగణపతులవారే.
మహాగణపతి ఆరాధనతోనే పకృతి పులకిస్తుంది. ప్రాణాధారమైన జలం సంవృద్ధిగా దొరుకుతుంది. ఈ ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి ఆరాధనోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. గణపతి పండుగలోని అంతరార్థం, ఆయనకు ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడంకానేకాదు. ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా తానైఉన్నాడో అట్టి గణపతిని శ్రద్ధతో పూజించడమే మనం చేయాల్సింది. మహాగణపతి అంటే మహా విగ్రహంకాదు, మట్టి వినాయకుడే మహాగణపతి అని గ్రహించాలి. అన్నం పెట్టే మట్టిని మరచిపోకుండా ఉండేందుకే మట్టిగణపతి ఆరాధన.
ఇది పర్యావరణ పండుగ
నీటిలో కలిసిపోయే గుణం విశేషంగా ఉండీ, పకృతి ప్రసాదించిన పదార్థంతోనే గణపతి మూర్తిని తయారుచేసి ఆరాధించమని పూర్వీకులు చెబుతుండేవారు. ఇందులోనూ విశేష గుణమున్న పదార్థాలు రెండు. 1. మట్టి, 2. పసుపు.
మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. అలాగే, ప్రకృతిమాత ప్రసాదించిన పసుపుకొమ్ములను దంచి పసుపు పొడిలో నీళ్లు కలిపి ముద్దగా చేసి ఆరాధించాలి. అంతేకానీ, నీటిలో కరగని పదార్థాలతోనూ, కాలుష్యం పెంచే రసాయనాలతోనూ వినాయకుని బొమ్మలను తయారుచేయమని ఎక్కడాలేదు. చక్కటి పర్యావరణ పండుగను తెలిసోతెలియకో అపరిశుభ్రం చేస్తున్నాం. పకృతికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం. ఫలితంగా రోగాలు, రొచ్చులు తప్పడంలేదు.
పూడికతీతే అసలు రహస్యం
పూర్వీకులు. చెరువుల్లోనూ, కుంటల్లోనో మట్టి తీసుకువచ్చి గణపతి ప్రతిమలు చేయమని చెప్పేవారు. గ్రామపెద్దలు, ఊరి మతపెద్దలు వర్షాకాలానికి ముందే సమావేశమై మట్టి విగ్రహాల గురించి ఓ నిర్ణయం తీసుకునేవారు. ఊర్లోని ఆసక్తికల యువకులను , ఇతరులను ఎంచుకుని మట్టి ప్రతిమలు చేసే పనిని పురమాయించేవారు. అంతే, యువశక్తి ముందు కదిలేది. చెరువుల్లోనూ, కుంటల్లోనూ మట్టి తవ్విప్రోగేసేవారు. వానాకాలం ఇంకా రాలేదు కనుక మట్టి తవ్వితీయడం చాలా సులువు. అలా ఒక క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవులు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుక, చెరువులు, కాల్వల పూడికతీత పనులే అంతరార్థంగా ఉన్నదన్నమాట. వినాయకుడు రాకముందే (వినాయక చవితి రాకముందే) ఈ పనంతా అయిపోవాలి. ఆయన మన ఇంట కాలుమోపే సమయానికి జలరాశితో ప్రకృతికాంత పులకించిపోవాలి. అందుకే గణపతిని ప్రార్థించి ఈ జలయజ్ఞం పనులను గణేష్ చతుర్థికి ముందే ప్రారంభించేవారు.
వానాకాలం ముందే పూడికతీత పనులు పూర్తయితే, ఆ తర్వాత వానలు పడ్డప్పుడు చెరువులు, కుంటల్లో నీళ్లు ఎక్కువగా నిల్వఉండేవి. నీటి నిల్వ సామర్థ్యం పెరిగేది. ఇలా నిలిచిన నీటిలో అధికభాగం ఆ ఊరి వ్యవసాయానికి, త్రాగునీటికీ, ఇతర అవసరాలకు ఉపయోగపడేది. పైగా, మట్టి వినాయకుల తయారీ వల్ల పూడికతీత పనులు కూడా పూర్తికావడంతో సహజంగానే భూగర్భజల మట్టం పెరిగేది. చెరువులు, కుంటల్లోని నీరు క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఇరుగుపొరుగు గ్రామాల్లోకూడా భూగర్భజలం సంవృద్ధిగా ఉండేది. తద్వారా ఎండాకాలంలో చెరువులు, కుంటలు ఎండిపోయినప్పటికీ, భూగర్భజలమట్టం పెరిగిన కారణంగా బావుల్లో నీరు ఇంకిపోయేదికాదు. ఇది మహాగణపతి జలయజ్ఞ ఫలం.
ఇంతటి పరమార్థం మట్టివినాయకుల తయారీ కింద మనవాళ్లు ఇమిడ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మట్టివినాయకుల తయారీ జలయజ్ఞంలో అంతర్భాగమేనన్నమాట.
మొక్కలకు ఎరువుగా…
మరో ఆసక్తికరమైన అంశం కూడా మట్టివినాయకుల తయారీ విధానంలో ఇమిడి ఉంది. అదేమంటే, మట్టి ప్రతిమలను పూజాదికాలు పూర్తయ్యాక, పత్రితోనూ, నవధాన్యాలతోనూ కలిపి ఇంటిపెరడులోని చెట్టకింద ఉంచేవారు. అందులోకూడా బలహీనంగా ఉన్న చెట్టుకింద ఉంచితే, ఆ చెట్టు త్వరగా , ఏపుగా పెరుగుతుందని కూడా విశ్వసించేవారు. ఇందులో దాగున్న అసలు విషయం ఏమంటే, పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే. దీంతో పత్రి సమేత వినాయక ప్రతిమ , వానల కారణంగా భూమిలోకి ఇంకి, పక్కనే ఉన్న చెట్టుకు బలం చేకూరుస్తుంది. ఆతర్వాత కాలంలో వినాయక విగ్రహాల నిమజ్జనం చోటుచేసుకున్నట్టు చరిత్ర చెబుతున్న సత్యం.
నిమజ్జనం – అసలు రహస్యం
నవరాత్రుల తరువాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదా కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తున్నది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక, 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.
పత్రి పూజ – రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తున్నది. అలా తొమ్మిది రోజులు చేయమని కూడా శాస్త్రం చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధమొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలేకానీ, వేరేవాటితో చేయకూడదు. ఔషధ పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటివల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిది రోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్టుగానే, పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే, తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారు. ఇదే అసలు రహస్యం.
ప్రకృతితో మమేకమయ్యే పండుగను కృతికంగా చేయకండి. పర్యావరణంతో ముడిపడిన పండుగ మరొకటి లేదని గ్రహించాలి.
– కణ్వస
Kanvasa19@gmail.com