సినిమాలకి ‘సంక్రాంతి’ పండగ లాంటి సీజన్. అయితే అది ఈసారి సినిమాల పండగ డిసెంబర్ నుంచే మొదలైయింది. డిసెంబర్ 1న యానిమల్ భారీ మూవీగా వచ్చింది. ప్రభాస్ సలార్ 22కి సిద్ధంగా వుంది. ఈ వారం కూడా రెండు ప్రామెసింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ట్రా’ర్డినరీ మ్యాన్. హాయ్ నాన్న గురువారం వస్తుంటే.. నితిన్ శుక్రవారం వస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకి తుపాను ఎఫెక్ట్ పడుతోంది.
మిగ్జాం తుపాను కోస్తా ఆంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను గమనం క్షణాల వ్యవధిలో పెను ప్రభావాన్ని చూపిస్తోందని వాతావరణ ఇప్పటికే రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్ తో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పంటల నష్టం తీవ్రంగా వుంది. భారీ వృక్షాలు , విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఇప్పటికే విమాన, బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇంటికి బయటికి రాకూడదనే హెచ్చరిలు జారీ చేశారు అధికారులు. తుపాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్, వర్షాల తీవ్రత ఎప్పటివరకూ కొనసాగుతుందనే ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఇలాంటి ప్రతికూల సమయంలో వస్తున్న సినిమాపై ఖచ్చితంగా ఎంతో కొంత ఈ ప్రభావం వుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా నాని సినిమాలకి వైజాగ్ లో మంచి ఆదరణ వుంటుంది. ఇటివలే అక్కడ జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నేను ఏ జోనర్ సినిమా చేసినా గొప్ప ఆదరించింది వైజాగ్ ప్రాంతమే’ అని స్వయం చెప్పారు నాని. మరి కోస్తాలో మిగ్జాం తుపాను తీవ్రత సినిమాలపై ఎంతలా వుంటుందో చూడాలి.