కొంతమంది మాటలకు అర్థాలే వేరు! వాళ్లు ఒకటి చెబితే.. మరోటి జరుగుతుంది. అదో రకమైన టంగ్ అన్నమాట. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మాటకూ అంత మహత్తు ఉందట. సినిమాల విషయంలో తన జడ్జిమెంట్ పూర్తిగా తప్పయిపోయిన సందర్భాలున్నాయని, ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో ఎందుకు ఆడుతుందో తాను జడ్జ్ చేయలేనని అంటున్నాడు ఈ సంగీత దర్శకుడు. సినిమాకి ఆర్.ఆర్ ఇస్తున్నప్పుడు ఏ దర్శకుడికైనా ఆ సినిమాపై ఓ అవగాహన ఏర్పడుతుంది. హిట్టో ఫట్టో తెలిసిపోతుంటుంది. అయితే మిక్కీకి ఆ నాడీ ఇంకా అంతు పట్టలేదట. ఈ విషయాన్ని తనే చెప్పేశాడు.
హ్యాపీడేస్‌కి రీ రికార్డింగ్ ఇస్తున్నప్పుడు శేఖర్ కమ్ములతోనే ”ఈ సినిమా ఎవరైనా చూస్తారా? తప్పకుండా ఫ్లాప్ అయి తీరుతుంది” అన్నాడట.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయిపోయింది. ఓ ట్రెండ్‌గా నిలచింది. ‘శతమానం భవతి’ సమయంలోనూ ఇలానే తప్పుగా అంచనా వేశాడట. ఆ సినిమాకి రీ రికార్డింగ్ అయిపోయిన తరవాత దిల్‌రాజుకి ఫోన్ చేసి ”సినిమా మరీ బోర్ కొట్టేసింది.. ఆడడం కష్టమే” అన్నాడట. కానీ ఆ సినిమా కూడా సూపర్ హిట్టయిపోయింది. ఇక నుంచి సినిమా జయాపజయాల విషయంలో ముందే ఓ అంచనాకు రాను. ప్రేక్షకుల తీర్పు వచ్చేంత వరకూ ఎదురు చూస్తా.. అంటున్నాడు మిక్కీ జే మేయర్. అది ఉత్తమమైన నిర్ణయం. మరి `మిస్టర్` విషయంలో మిక్కీ సిక్త్ సెన్స్ ఏం చెప్పిందో.