మైక్రోసాఫ్ట్ కంపెనీ శ్రీకాకుళంలో స్థాపించడం ఏమిటి? అని ఆశ్చర్యపడిపోకండి. ఏపీ ప్రభుత్వంతో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థ శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రయోగత్మక ప్రాజెక్టు త్వరలో మొదలుపెట్టబోతోంది. దానిపేరు వైట్ స్పేస్! జిల్లాలో టీవీ ప్రసారాల కోసం కేటాయించబడిన స్పెక్ట్రం తరంగాలలో నిరుపయోగం ఉన్న భాగాన్ని వినియోగించుకొని జిల్లా వ్యాప్తంగా అతితక్కువ ధరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చేయబోయే ప్రయోగమే ఈ వైట్ స్పేస్! దేశంలో మొట్టమొదటి సారిగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రయోగం జరుగుతోంది.
సాధారణంగా వైఫీ కనెక్షన్ ద్వారా కేవలం 100మీటర్ల పరిధిలోనే ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం ఉంటుంది. కానీ సుమారు 200-300 ఎం.హెచ్.జెడ్. తరంగ శక్తిగల టీవీ తరంగాల ద్వారా 10కిమీ పరిధిలో గల అన్ని ప్రాంతాలకు వైఫీ పద్దతిలో ఇంటర్నెట్ సౌకర్యం అందించవచ్చును. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి అధనంగా ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు కనుక ఈ పద్దతిలో ఇంటర్నెట్ సౌకర్యం చాలా తక్కువ ధరకే అందించవచ్చును. మైక్రో సాఫ్ట్ సంస్థ ఇప్పటికే ఘనా, బోట్స్ వానా, నమీబియా, టాంజానియా, దక్షిణ ఆఫ్రికా, కెన్యా, సింగపూర్ తదితర దేశాలలో విజయవంతంగా అమలుచేస్తోంది. కనుక శ్రీకాకుళంలో మొదలుపెట్టబోతున్న ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందని ముందే నిర్ధారణ అయిపోయిందని చెప్పవచ్చును.