ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు పనిచేస్తుండగా, అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించబోతుంది.
దాదాపు 267కోట్లతో 40ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబాయ్, పుణే, చెన్నైలలో డేటా సెంటర్లు ఉండగా, ఇప్పుడు హైదరాబాద్ లోనూ ప్రారంభించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామ పరిధిలో ఈ భూమి కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్.
అయితే, ఇది ఎప్పటి నుండి పనిచేసేలా పనులు చేపడతారు… దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఇక్కడే ఎందుకు ప్రారంభించబోతున్నారన్న వివరాలు మైక్రోసాఫ్ట్ ఇంకా ప్రకటించలేదు. కానీ, మైక్రోసాఫ్ట్ నిర్ణయం హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ఊపు తీసుకరాబోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.