హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేతగా ఎదిగిన సత్య నాదెళ్ళ జీవితం త్వరలో ఏపీలో తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠంగా కనిపించనుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు తెలుగు పాఠ్యపుస్తకాలు, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాలలో ప్రభుత్వం మార్పులు చేసింది. పలువురు ప్రముఖ వ్యక్తుల జీవిత గాధలను చేర్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్ఫూర్తి ప్రదాతలు అనే శీర్షికతో వీటిని పాఠాలుగా చదువుకుంటారు.
ఎనిమిదో తరగతి తెలుగు ఉపవాచకంలో సత్య నాదెళ్ళ, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు, చిత్రకారుడు దివంగత సంజీవదేవ్ జీవిత చరిత్రలను చేరుస్తున్నట్లు ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఏడో తరగతి తెలుగు ఉపవాచకంలో జానపద కళలను తెలియజేసే విధంగా కూచిపూడి, హరికథ, బుర్రకథ, తప్పెటగుళ్ళపై పాఠ్యాంశాలను చేరుస్తామని వెల్లడించారు. పదోతరగతి ఉపవాచకంలో మన రాజధాని పేరుతో అమరావతి చరిత్ర, ప్రాముఖ్యాన్ని తెలియజేసే పాఠ్యాంశం ఉంటుందని చెప్పారు.