పది అంటే పది నిమిషాలు. పది జీవోలు వచ్చేశాయి. కానీ..ఆ పది జీవోలు అత్యంత రహస్యం, కాన్ఫిడెన్షియల్. అన్నీ పంచాయతీరాజ్‌కు సంబంధించినవే. అంత రహస్యం ఏమిటబ్బా..? అని అందరూ ఆలోచించేలోపే… ఫ్లాష్ లాగా కళ్ల ముందు కనబడే విషయం… స్థానిక ఎన్నికలు. 50శాతం లోపే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ప్రభుత్వం… బీసీల రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని… బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించించిన గంటల్లోనే పది రహస్య జీవోలు విడుదలదయ్యాయి. అంటే.. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన కీలక నిర్ణయాలేవో తీసుకుని.. అవి ప్రజల్లో చర్చనీయాంశం అవుతాయని.. వివాదాస్పదం అవుతాయన్న ఉద్దేశంతో.. కాన్ఫిడెన్షియల్‌గా ఉంచినట్లుగా అనుమానిస్తున్నారు.
జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు.. కొత్త పద్దతిలో 25శాతం కూడా రిజర్వేషన్లు దక్కడం అనుమానమే. ప్రభుత్వం ఎంత మేర రిజర్వేషన్లు ఖరారు చేస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే బీసీ సంఘాలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోలు.. అందరికీ అందుబాటులో ఉంచితే… మరింతగా వారి ఆగ్రహం పెంచినట్లవుతుందనే కారణంతో.. వాటిని రహస్యంగా ఉంచినట్లుగా అనుమానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలంటే.. ఖచ్చితంగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అలా ఖరారు చేయాలంటే… ఆషామాషీగా చేస్తే కుదరదు. దానికో ప్రాతిపదిక ఉండాలి. ప్రభుత్వం ఏ ప్రాతిపదిక చూపిస్తుందో… ఇప్పటికీ క్లారిటీ లేదు.
ఈ రహస్య జీవోల్లోని ఆదేశాలను చూపి.. ఈ రిజర్వేషన్ గండం గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఎన్నికల నిర్వహణ అనేది నేరుగా ప్రజలతో.. సంబంధం ఉన్నది. ఎన్నికల ప్రక్రియలోని ప్రతీ అంశం పారదర్శకత ఉంటేనే.. ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం.. రహస్యంగా ఉంచడానికే తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అనేక అనుమానాలకు దారి తీస్తోంది.