కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆ వెంటనే ఉపఎన్నికలు వస్తాయని.. బీజేపీ తరపున ఆయన నిలబడతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన రాజీనామా చేసినా ఉపఎన్నిక సాధ్యమా అన్న ప్రశ్న సహజంగానే ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి కాల వ్యవధి మరో పదిహేను నెలలు మాత్రమే ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఆరు నెలల కంటే పదవీ కాలం తక్కువ ఉంటే.. ఉపఎన్నిక పెట్టరు. ఆ ప్రకారం ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాలి ఆ తర్వాత పదవి కాలం మరో ఆరేడు నెలలు మాత్రమే ఉంటుంది.
ఉపఎన్నిక అనేది బీజేపీ వ్యూహం కాబట్టి… ఈసీ దగ్గర ఉన్న పలుకుబడితో ఉపఎన్నిక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుందనే అనుకున్నా.. ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో ఇరుక్కుంటుదా అన్నది కీలకం. ఉపఎన్నిక పెట్టడానికి బీజేపీకి ఎంత బలం ఉందో.. అది రాకుండా చేయడానికి కూడా టీఆర్ఎస్కు అంత బలం ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పీకర్ ఎంత కాలం అయినా సాగదీయడానికి చాన్స్ ఉంది. అది స్పీకర్ అధికారం. తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకే రాజీనామా చేస్తున్నారని అనిపిస్తే.. టీఆర్ఎస్ రాజీనామాను ఆమోదించకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. గతంలో ఇలానే ఆవేశపడి ఈటల రాజీనామాను క్షణాల్లో ఆమోదించి టీఆర్ఎస్ చిక్కుల్లో పడింది.
అంతకు మించి కోమటిరెడ్డి ఇప్పుడు ఉపఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా అన్నది టాపిక్., టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఆయన ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టాలో అంచనా వేయడం కష్టం. అలా తాను కష్టపడి ఖర్చు పెట్టి గెలిచినా తనకు వచ్చే లాభం స్వల్పమే. మళ్లీ ఎమ్మెల్యే అవుతారు. కానీ మళ్లీ ఆరు నెలలు.. లేదా ఏడాదిలో మళ్లీ అదే స్థాయిలో ఖర్చు పెట్టుకుని మళ్లీ ఎన్నికల్లో పోటీ పడాలి. తాను ఇంత రిస్క్ ఎందుకు చేయాలో రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తే ఆయన పునరాలోచించే చాన్స్ ఉంది. బీజేపీ కోసం ఆయన సమిధగా మారేందుకు సిద్ధమైతే ఉపఎన్నిక వస్తుంది..లేకపోతే రాదని.. రాజకీయవర్గాలు తేల్చేస్తున్నాయి.