అప్పులున్నా, ఆర్ధికపరమైన భారాలూ బాధ్యతలూ వున్నా తినడానికీ వుండటానికీ ఇబ్బంది లేని వారిని మధ్యతరగతి మనుషులు అంటూవుంటాము. భారత్ సహా దక్షిణ ఆసియా దేశాల్లో ”మధ్యతరగతి” అనేది ఆర్ధికపరమైన గుర్తింపుగా కాక, కుటుంబ పరంగా ఒక జీవన విధానాన్ని, సంఘపరమైన ఒక సంస్కృతినీ సూచిస్తూ వుంటుంది. ఈ పద్ధతి ప్రకారం మనజనాభాలో కనీసం 35 నుంచి 40 శాతం మంది మధ్యతరగతి వారే!
అయితే ప్రపంచీకరణ ధోరణుల్లో ఏదేశపు కరెన్సీనైనా డాలర్లలో కొలవడమే ఒక ప్రమాణమైపోయింది. రాబడులు రాల్చని ఆస్ధులు, బరువు తూగని విలువలూ నిరర్ధకాలైపోయాయి. ఎవరి తరగతలనైనా, స్ధాయిలనైనా, హోదాల నైనా తుకం వేసేవి కేవలం వారి ఆదాయాలే అయిపోయాయి. ఈ లెక్క ప్రకారం భారతదేశపు జనాభాలో మధ్యతరగతి వారు కేవలం 13 శాతం మంది మాత్రమే వున్నారని సామాజిక పరిణామాలపై వేరువేరు అంశాలను పరిశోధించి విశ్లేషించే అమెరికన్ సంస్ధ “పెవ్” వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మధ్యతరగతి సైజు మనం అనుకున్నంత పెద్దది కాదని చాలా చిన్నదనీ భారతీయుడే అయిన సంస్ధ అసోసియేట్ డైరక్డర్ రాకేష్ కొచ్చర్ ఒక ఇంగ్లీషు టివి ఛానల్ లో చెప్పారు.
అంటే భారత్ లో మధ్యతరగతి ఆదాయవర్గాల వారుగా పిలవబడుతున్న ప్రతీ వందమందిలో అంతర్జాతీయ ప్రమాణాలప్రకారం మధ్యతరగతి వారు 33 మంది మాత్రమే. మిగిలిన 67 మందీ పేదలే!
అయితే ప్రపంచవ్యాప్తంగా పదేళ్ళలో పేదల సంఖ్య దాదాపు సగం వరకూ తగ్గింది. అతితక్కువగా రోజుకి 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కల వారి సంఖ్య 160 కోట్లనుంచి 94 కోట్లకు తగ్గింది.ఇది 29 శాతం నుంచి 15 శాతానికి తగ్గడమేనని సంస్ధ ఆర్థిక విషయాల నిపుణ అండ్రేడామిన్ విశ్లేషించారు. ఈ ప్రకారం రోజుకు 2 డాలర్లకు ఎక్కువ 10 డాలర్లకు తక్కువ ఆదాయం కల అల్పాదాయ వర్గాల వారు కలవారు 275 కోట్ల నుంచి 344 కోట్లకు పెరిగారు. అంటే ప్రపంచ జనాభాలో 50 శాతం నుంచి 56 శాతానికి పెరిగారు. పేదలు, అల్పా దాయం కల్గిన ప్రజలు కలిసి 71 శాతం ఉన్నారు. ప్రపంచ జనాభాలో హెచ్చుమంది వీరే.
రోజుకి 10 డాలర్లకు ఎక్కువ 20 డాలర్లకు తక్కువ ఆదాయం కల మధ్య తరగతి వారు 39.9 కోట్ల నుంచి 78.4 కోట్లకు పెరిగారు. 20 డాలర్లకు ఎక్కువ 50 డాలర్లకు తక్కవ ఆదాయంకల ఉన్నత మధ్యతరగతి వారు 7 శాతం నుంచి 9 శాతానికి పెరిగారు. వీరిజనాభా 40.8 కోట్ల నుంచి 58.4 కోట్లకు పెరిగింది. రోజుకు 50 డాలర్ల పైబడిన ఆదాయం కల ధనికులు 39.9 కోట్ల నుంచి 42.7 కోట్లకు పెరిగారు. ఇది 6 శాతం నుంచి 7 శాతానికి పెరుగుదల. ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి జనాభా 22 శాతం వుండగా భారతదేశంలో ఇది కేవలం పదమూడుశాతమేనని, భారతదేశంలోని పేదరికం 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గినా, మధ్యతరగతి కుటుంబీకుల శాతం పెరుగుదల 3 శాతానికి మించలేదని ఈ విశ్లేషణ వెల్లడించింది.
మధ్యతరగతి పెరుగుదల కొన్న దేశాలలో చాలా ఎక్కువగా వుంది.చైనా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్ దేశాలలో ఈ వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. దీనికి విరుద్ధంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నారు. చైనాలో 2001లో 3 శాతం ఉండగా 2011 నాటికి గణనీయంగా 18 శాతానికి చేరుకున్నారు. అంటే 20 కోట్ల మంది చైనీయులు రోజుకు 10 డాలర్లకు మించి ఆదాయం సంపాదిస్తున్నారు. మధ్యతరగతి వర్గం వారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 31 శాతం నుంచి 51 శాతానికి పెరిగారు. తూర్పు యూరప్‌లో 2001లో 21 శాతం ఉన్న మధ్యతరగతివారు 2011 నాటికి 53 శాతానికి చేరుకున్నారని ”పెవ్”అధ్యయనాలు వివరిస్తున్నాయి.