ఏపీలో మధ్యతరగతి ప్రజలు చితికిపోతున్నారు. వారి ఆదాయం దారుణంగా పడిపోతోంది. మధ్య తరగతి కాస్త నిరుపేదలుగా మారుతున్నారు. వారిలో కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఏపీలో ఉపాధి దొరకకపోవడానికి తోడు .. ప్రభుత్వ విధానాల కారణంగా వారంతా పనులకు దూరమవుతున్నారు. ఫలితంగా రాష్ట్రం కూడా వెనుకబడిపోతోంది.
దేశమంతా జీఎస్టీలో విపరీత పెరుగుదల – ఏపీలో అంతంతే !
కేంద్ర ప్రభుత్వానికి నెలవారీ జీఎస్టీ వసూళ్లు ఇబ్బడిమబ్బడిగా వస్తున్నాయి. చరిత్రలో లేనంతగా ఒక్క నెలలో లక్షా 80వేల కోట్లకుపైగా వచ్చాయని లెక్కలు బయట పెట్టింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే.. మొత్తంగా పదహారు శాతం పెరిగింది. కానీ ఏపీలో జీఎస్టీ వసూళ్లు పెద్దగా పెరగలేదు. ఆరు శాతమే వృద్ధి సాధించింది. అదే తెలంగాణలో 13, తమిళనాడులో 19 శాతం వృద్ధి కనిపించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 25 శాతానికి మంచి వృద్ధి సాధించింది. నిజానికి ఈ ఏజాది వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పెరుగుదల లేకపోతే.. ఆదాయం తగ్గిపోయినట్లు.
ఏపీలో తగ్గిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
టాక్స్ అనేది వస్తువు ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఓ వంద రూపాయల వస్తువుపై పది రూపాయల టాక్స్ వస్తుంది. అదే వస్తువు రేటు నూట యాభై అయితే పదిహేను రూపాయల టాక్స్ వస్తుంది. ధరలు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ పన్ను పెరుగుతోంది. నిత్యావసర వస్తవుల ధరలే ఏడాదిలో పాతిక శాతానికిపైగా పెరిగాయి. టాక్సులు కూడా ఆ మేరకు పెరగాల్సి ఉంది. కానీ వాటిని కూడా కొనేవారు తగ్గిపోయారని జీఎస్టీ లెక్కలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందనడానికి..ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు కూడా భారీగా తగ్గిపోవడం మరో సాక్ష్యం.
తగ్గిపోయిన ఉపాధి – పేదలుగా మారుతున్న మధ్య తరగతి !
సాధారణంగా ద్విచక్ర వాహనాలను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొంటారు. అది వారి ఉపాధికి కూడా ఎంతో అవసరం. కానీ ఏపీలో అలాంటి ద్విచక్ర వాహనాలు ఏటికేడు తగ్గిపోతున్నాయి. అంతకు ముందు ఏడాది 23 శాతం తగ్గిపోతే.. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పది శాతం వరకూ తగ్గిపోయాయి.ఈ పరిస్థితి అధికారుల్ని కూడా విస్మయ పరుస్తోంది. ఈఎంఐలతో కూడా కొనేంత శక్తి ప్రజల వద్ద ఉండటం లేదని అంటున్నరాు. ఈ పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రజల్లో మెజార్టీ నిరుపేదలుగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.