ఓ ఆవారా అబ్బాయి… పేరు రాఘవ. ఎప్పుడూ తండ్రి చేతిలో తిట్టు తింటుంటాడు. వాళ్లకో కాకా హోటల్. అందులో రాఘవ చేసే బొంబాయి చెట్నీ యమ ఫేమస్. గుంటూరు వెళ్లి అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టాలన్నది రాఘవ ఆశ, ఆశయం. మరి అది నెవరేరిందా? గుంటూరులో రాఘవ తన చెట్నీ రుచి చూపించాడా? తెలియాలంటే `మిడిల్ క్లాస్ మెలొడీస్` చూడాల్సిందే. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. వినోద్ ఆనంతోగు దర్శకుడు. ఈనెల 20న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. ట్రైలర్ ఈరోజు వదిలారు.
టైటిల్ కి తగ్గట్టు.. మధ్య తరగతి జీవితం, వాళ్ల ఆశలు, కోరికలు, ఇబ్బందులూ..అన్నీ తెరపై చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఇది వరకే విడుదల చేసిన `గుంటూరు` పాటకు మంచి స్పందన వచ్చింది. నేటివిటీని నమ్ముకున్న కథలెప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈ సినిమా కూడా నేటివిటీనే నమ్ముకుంది. మరి.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. `దొరసాని`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్.. రెండో ప్రయత్నంలోనైనా విజయాన్ని అందుకుంటే.. హీరోగా ఇంకొన్ని అవకాశాలు చేజిక్కించుకున్నట్టే.