రూ. పది లక్షలు. రూ.పది లక్షల అప్పు తీర్చే దారి లేక… భార్యా, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ మధ్యతరగతి రైతు. ఇది జరిగిన రెండు, మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లోని అత్యంత కాస్ట్లీ హోటల్లో ఓ బడా కుటుంబం ఇంట్లో చిన్న పంక్షన్ కోసం మూడు కోట్లు వెచ్చించారు. అతిధుల్లో అందరూ.. రాజకీయ నేతలు.. ప్రభుత్వ ఉన్నతాధికారులే. మధ్యతరగతి కుటుంబంలోని నాలుగు ప్రాణాలు రూ. పది లక్షల పాటిచేయలేదు.. కానీ ఓ ధనవంతుల ఇళ్లలోని చిన్న పార్టీకి రూ. మూడు కోట్లు ఓ లెక్క కాదు. దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మధ్యతరగతి ప్రజలపై జరుగుతున్న నిలువదోపిడికి సాక్ష్యం.
కరోనాతో చితికిన మధ్య తరగతి..!
చితికిపోతున్న మధ్యతరగతి … కుబేరులవుతున్న పలుకుబడిగల వ్యాపారుల మధ్య నలిగిపోతున్న భారతదేశ భవిష్యత్ ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. దేశంలో ప్రజల కష్టాలు చూడటానికి అనుభవించడానికి రాజకీయ నాయకుడే అయి ఉండాల్సిన అవసరం లేదు. కులం, మతం, ప్రాంతం… అనే రాజకీయ పార్టీలు పుట్టించిన వైరస్‌లను కాస్త దులుపుకుని కళ్లు పైకెత్తి.. నాలుగు వైపులా చూస్తే..దేశ భవిష్యత్ ఎంత ప్రమాదకరంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఇద్దరికీ ఉద్యోగాలు పోయాయి..రోజు గడవడం కష్టంగా ఉంది..! లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్ దంపతుల ఆవేదన..!. వ్యాపారం తగ్గిపోయింది.. నిర్వహణ ఖర్చులు.. కుటుంబ ఖర్చులు పెరిగిపోయాయి.. అప్పులు పెరిగిపోతున్నాయి.. ఓ సామాన్య మధ్యతరగతి జీవి ఆవేదన ఇది. ఇక రోజుకూలీల పరిస్థితి.. చిరు వ్యాపారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది నిజం. ఇప్పుడు దినపత్రిక తిరగేసినా… ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చూసినా… లాక్ డౌన్ కారణంగా ఉపాధి.. ఉద్యోగం కోల్పోయి ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎక్కడో ఓ చోట తారసపడుతూ ఉంటారు. లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన పరిశ్రమల్లో ప్రింట్ మీడియా కూడా ఉంది. వారు కూడా పేజీలను కుదించేశారు. అన్నీ వార్తలుచెప్పడం లేదు. అందుకే… ఆత్మహత్యల వార్తలన్నీ వెలుగులోకి రావడం లేదు. కుటుంబాలతో సహా ప్రాణాలు తీసుకుంటేనే వార్త అవుతోంది. కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్న పరిస్థితిని ప్రభుత్వాలు ఇంకా తేలికగా తీసుకుంటూనే ఉన్నాయి. సమస్య ఏంటో అర్థం చేసుకునేందుకు… పరిష్కరించేందుకు ప్రయత్నించడం లేదు.
నిరుపేదలుగా మారుతున్న కుటుంబాలు..!
దేశంలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉంది. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వాలు రేషన్ పంపిణీ చేస్తున్నాయి. వీలైనంత వరకు మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నాయి. ఏపీ లాంటి ప్రభుత్వాలు… అయితే ఖర్చులకు డబ్బులూ ఇస్తున్నాయి. వారిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ లేదు. వారి జీవన ప్రమాణాల ప్రకారం.. వారి జీవితం నడిచిపోతోంది. సమాజంలో ధనవంతులు కూడా… తమ తమ పరిధిలో భాగున్నారు. అందరూ పలుకుబడి కలిగిన వారు కావడంతో ప్రభుత్వాలతో పనులు చేయించుకుని బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టి అయినా… తమ రాయల్టీ తగ్గకుండా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఎటూ తిరిగి మధ్యతరగతి ప్రజలకే పెద్ద గండం వచ్చి పడింది. మధ్యతరగతి ప్రజలు నెలవారీ ఖర్చులకు జీతభత్యాలు.. వ్యాపార ఆదాయం సరిపోని పరిస్థితి. చిరు వ్యాపారులు.. ఓ మాదిరి వ్యాపారాలు చేసేవారు.. అరకొరజీతంతో పని చేసే ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కువగా రుణాలు కట్టలేక డిఫాల్ట్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలకు రూ. లక్ష కోట్ల వరకూ మధ్యతరగతి ప్రజలు తీసుకున్న క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించడం లేదన్న నివేదికలు వెలుగులోకి వస్తూండటం దేనికి సంకేతం..?. మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిపైనే పన్నుల భారాన్ని మోపుతోంది. రెండున్నర లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే పన్నులు వసూలు చేస్తోంది. ఆ తర్వాత ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇక రాష్ట్రాలు.. స్థానిక సంస్థలు ఇలా వరుసగా పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వాల నిర్వాకంతో ఆదాయం కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు.. అదే ప్రభుత్వాలు పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తూండటంతో ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాడు. కరోనా అనంతర పరిస్థితుల్లో.. 3.2 కోట్ల మధ్యతరగతి కుటుంబాలు దిగువకు పడిపోయాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు. కరోనా సంక్షోభం రాకముందు 9.9 కోట్ల మంది ఉండే మధ్య ఆదాయ వర్గం ఆ తర్వాత ఏడాది కాలంలోనే 6.6 కోట్లకు తగ్గిపోయింది. అయినా వీరు .. మధ్యతరగతి పేరుతో ప్రభుత్వాలను పోషించడానికి కష్టపడాల్సి వస్తోంది.
పేదలకు..పెద్దలకు పంచేది మధ్యతరగతి కట్టే పన్నులే..!
దేశంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నది ఎవరూ ఉంటే… అంబానీ, ఆదానీల స్థాయి వ్యాపారవేత్తలు మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా. టేకోవర్లతో అంబానీలు.. అదానీలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదుగుతున్నారు. నిజంగా ప్రజలకు అవసరమైన సేవలు..ఉత్పత్తులు అందించి… వ్యాపారంలో కుబేరులుగా ఎదుగడం వేరు. బిల్ గేట్స్ నుంచి ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ అలా ఎదిగినవారే. కానీ నయా భారత్‌లో టేకోవర్లతోనే కుబేరులవుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ వ్యాపారాలు చేయకపోయినా లక్షల కోట్ల అధిపతులవుతున్నారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని చెల్లిస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. వారికి తోడు ప్రభుత్వ ఉద్యోగులూ సంతోషంగా ఉన్నారు. వారికి జీతాల్లో ఎలాంటి కోత లేదు. భత్యాల్లోనూ కోత లేదు. కేంద్రం కొంత కోత పెట్టినా… అది వారి జీవన ప్రమాణాలపై ప్రభావం చూపేంత లేదు. ఇక రాష్ట్రాల ఉద్యోగులకు జీతాల పెంపును చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 30శాతం పీఆర్సీ ప్రకటిచింది. తెలంగాణతో పోల్చుకునే ఏపీలోనూ ఇవాళ కాకపోతే రేపైనా 30శాతం పెంపును ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో అక్కడి ఉద్యోగులూ హ్యాపీగానే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు .. కింది స్థాయి ఉద్యోగికే యాభై వేలు దాటిపోతాయి.. ఇక పై స్థాయి… ఉద్యోగికి లకారాల్లోనే ఉంటాయి. వీరెవరికి ఎలాంటి చింతా ఉండదు. లాక్ డౌన్ వేసినా వేయకపోయినా వీరి అకౌంట్లలోకి జీతాలు పడిపోతాయి.
మిడిల్ క్లాస్‌ని నిలువ దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు..!
అత్యంత నిరుపేదలను ప్రభుత్వాలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాయి. అత్యంత ధనికులు.. రాజకీయ పార్టీల ఆర్థిక అవసరాలకు ఖజానాలాగా ఉపయోగపడుతూ… తమ ఖజానాను నింపుకుంటున్నాయి. కానీ మధ్య తరగతి జీవులు మాత్రమే.. ఎటూ కాకుండా పోయారు. ఇరవై నాలుగు గంటలు కష్టపడటం… వారి సంపాదన నుంచి ప్రభుత్వానికి ఆదాయం అందించడం.. తప్ప వారికి మరో వ్యాపకం లేకుండా పోయింది. ఓ మాదిరి సంపాదన పరుడైతే చాలు ప్రభుత్వానికి పండగే. పని చేసుకున్నందుకు పన్ను దగ్గర్నుంచి సంపాదించుకునేవరకూ పన్నులు వసూలుచేస్తున్నారు. ఇంత చేసినా వారి పట్ల ప్రభుత్వాల కనీస బాధ్యతగా ప్రవర్తిస్తున్నాయా అన్నది సందేహం. అలాంటి బాధ్యత ఉంటే నిత్యావసర వస్తువల ధరలను అయినా అందుబాటులో ఉంచేవారు. కనీసం ఉంచడానికి ప్రయత్నించేవారు. కానీ పెట్రోల్, డీజిల్ నుంచి ఏడాదికి రూ. మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు… వాటి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జీవనం భారం అవుతుందనే ఆలోచనను మాత్రం చేయడం లేదు. అంటే వారి పట్ల ప్రభుత్వాలకు ఏమైనా బాధ్యత ఉన్నట్లేనా..?
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలు..!
ప్రభుత్వాలకు ఆదాయం అవసరం అయితే.. పన్నుల భారం మోసేది మధ్యతరగతి వారే. ప్రభుత్వం ఏదైనా కొత్త ఆలోచన చేస్తే దాన్ని భరించాల్సింది కూడా మధ్యతరగతి వారే. నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో బ్లాక్ మనీ ఉన్న వారందరూ తమ మనీని వైట్‌గా మార్చుకున్నారు.. కానీ అసలు మనీనే సరిగ్గా ఉండని మధ్యతరగతి ప్రజలు మాత్రం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశంలో పాలకులు మధ్యతరగతి ప్రజల్ని బలి పెట్టి .. అటు నిరుపేదల్ని..ఇటు బడా బాబుల్ని పోషిస్తున్నారు. పేదలకు తాయిలాలు ఇస్తున్నారు. పెద్దలకు రాయితీలుస్తున్నారు. ఎటూ కాకుండా పోతోంది మధ్యతరగతే. వారు కూడా ఇప్పుడు నిరుపేదలుగా మారుతున్నారు. కష్టపడి ఎదుగుదామనకుంటున్న వారి కష్టాన్ని ప్రభుత్వాలే గుంజుకుంటున్నాయి. చెత్త విధానాలతో వారి జీవనాలను దుర్భరం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశంలో మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారింది. కుటుంబాన్ని.. దేశాన్ని తమ భుజాల మీద మోస్తూ… అలసి పోతున్నారు. ఇలాంటి పరిస్థితులే ఉంటే.. కొన్నాళ్లకు దేశంలో.. రెండే వర్గాలు మిగులుతాయి.. ఒకటి నిరుపేదలు.. రెండు అత్యంత ధనికులు. మధ్యతరగతి వర్గం అంతరించి పోతుంది. వారంతా… నిరుపేదలుగా మారుతారు. అదే జరిగితే దేశం అసమానతల్లో ఎవరూ సరిదిద్దలేనంత స్థాయికి వెళ్లిపోతుంది. ఈ ప్రమాదాన్ని పాలకులు ఎప్పుడు పసిగడతారో తెలియదు.. పసిగట్టినా..ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సైలెంట్‌గా ఉండటానికే చాన్స్ ఉంది.
ప్రజలను బాగు పర్చడమే రాజకీయం. దురదృష్టవశాత్తూ.. దేశంలో ఆ తరహా రాజకీయం జరగడం లేదు. ప్రజలంటే.. తమ ఓటర్లు.. తమ పార్టీకి సానుభూతిపరులు.. తమకు ఆర్థికంగా అండగా ఉండే పారిశ్రామికవేత్తలు అనుకునే పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు ప్రభుత్వాలకు ఓటు బ్యాంక్‌గా మారిపోయారు. ఇప్పుడిక మార్పు రావాల్సింది ఆ ఓటు బ్యాంక్‌లోనే..!