ఒక్కొక్కరుగా నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ జారుకోవడం పూర్తయింది. కాకపోతే వారంతా మా పార్టీ ఎమ్మెల్యేలే.. ఫిరాయించారు అని ఒకవైపు తెదేపా అరచి గీపెట్టడం మాత్రం ఇంకా జరుగుతోంది. సాంకేతికంగా దీనిని ఫిరాయింపుగా పేర్కొనే అవకాశం ఉన్నది గనుక.. ఆ మేరకు రాద్ధాంతం చేస్తూన్నది తెలుగుదేశం. అయితే.. వారికి ఆ పని కూడా లేకుండా.. ఇవాళ టెక్నికల్‌గా కూడా ఓ భరతవాక్యం పలకబోతున్నారు. ఎటూ తెలుగుదేశం గెలిచిన 15 సీట్లలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు అంటే 10 మంది తెరాసలో చేరిపోయిన నేపథ్యంలో.. వారు తాము తెరాసలో విలీనం అయినట్లుగా గురి ్తంచాల్సిందిగా స్పీకరు మధుసూదనాచారికి శుక్రవారం నాడు లేఖ ఇచ్చి.. అధికారికంగా తెరాస ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ లాంఛనం పూర్తయితే సాంకేతికంగా కూడా తెలుగుదేశం ఇక మాట్టాడ్డానికి అవకాశం ఉండదు.
తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించడం ప్రారంభించిన నాటినుంచి.. తెదేపా నాయకులు పదేపదే దీనిమీద రగడ చేస్తూనే ఉన్నారు. వారు తమ పార్టీ గుర్తు మీద గెలిచారు గనుక.. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకరుకు పలుమార్లు విజ్ఞప్తులు ఇచ్చారు. కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. స్పీకరు ఎదుట ధర్నాలు కూడాచేశారు. అన్ని ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. అయితే మూడింట రెండొంతుల మంది పార్టీ మారితే.. ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. ఈ నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్యేలు పదిమందీ మారిపోయారు. వారంతా కలిసి తమ సంతకాలతో కూడిన లేఖను శుక్రవారం స్పీకరుకు ఇవ్వబోతున్నారు.
తమను తెదేపాలో చీలికవర్గంగా గుర్తించి, తెరాసలో విలీనం అయినట్లుగా గుర్తించాలని వీరు కోరుతారు. ఈ లాంఛనం వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో శాసనమండలిలో కూడా.. ఇదే తరహాలో.. తెలుగుదేశం నుంచి చేరిన ఎమ్మెల్సీలనందరినీ చీలికవర్గంగా తెరాసలో విలీనం అవుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. అదే సూత్రాన్ని ఇప్పుడు కూడా పాటించి, మమ అనిపిస్తారని.. వీరి ఫిరాయింపుల గురించి ఇకపై తెదేపా నాయకులు కోర్టు రూపంలోను, సాంకేతికంగానూ నోరెత్తకుండా కట్టడిచేస్తారని అంతా అనుకుంటున్నారు.