ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు స్పీకర్ అధికారమని హైకోర్టు స్పష్టం చేయడంతో బీఆర్ఎస్లో నిరాశ కనిపిస్తోంది. ఇంత కాలం అనర్హతా బూచి చూపించి చాలా మందిని పార్టీ మారకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత తమ పదవులు పదిలమేనని .. పార్టీ మారినా తమ జోలికి రాలేరని తేలిపోయింది. దీంతో గతంలో చర్చలు జరిపిన వారు ఇప్పుడు మళ్లీ తెర ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీనికి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డిపై ఇంత కాలం ఒంటి కాలి మీద లేచిన సబితా ఇంద్రారెడ్డి, ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుంటున్నారు. కార్తీక్ రెడ్డి అదానీ అంశంపై రిపబ్లిక్ టీవీ డిబేట్లో పాల్గొని కేటీఆర్ వాదనను పూర్తిగా తిరస్కరించారు. అదానీ ఇచ్చిన వంద కోట్లను రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా ప్రచారం చేయడం తప్పని..అది తన తల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్శిటీ కోసం ఇచ్చిన విరాళమని.. స్పష్టం చేశారు. అలాంటి చారిటీపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు.
కార్తీక్ రెడ్డి వాదన బీఆర్ఎస్ వాదనకు రివర్స్‌లో ఉండటంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రారంభమయింది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అంటూ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారానికి క్షేత్ర స్థాయిలో ఉన్న అభిప్రాయానికి చాలా తేడా ఉందని.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ కూడా చెబుతున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా తమ పార్టీలోకి వస్తున్నారని అంటున్నారు.