టర్కీలో శుక్రవారం సాయంత్రం సైనిక తిరుగుబాటు జరిగింది. టర్కీ పార్లమెంటు భవనం, పోలీస్ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడులు జరిగాయి. టర్కీ రాజధాని అంకారా, మరో ప్రధాన నగరం ఇస్తాంబుల్ ల్లో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలని, టీవీ, రేడియో స్టేషన్లని, ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైనికులు తమ అధీనంలోకి తీసుకొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దేశంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం, మానవహక్కుల రక్షణ, ప్రజల స్వేచ్చకి భంగం కలుగుతున్నందున సైనిక తిరుగుబాటు చేయవలసి వచ్చిందని మిలటరీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
సైనిక తిరుగుబాటు జరిగిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ చాలా చురుకుగా చర్యలు చేపట్టి దానిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశప్రజలు అందరూ వీధుల్లోకి వచ్చి తన ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. సైనిక తిరుగుబాటుకి కుట్ర పన్నిన ఒక సైనిక ప్రధాన అధికారిని నిర్బంధంలోకి తీసుకొన్నట్లు టర్కీ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. టర్కీ వాయుసేన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. వాయుసేనకి చెందిన యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలని రక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్తాంబుల్, అంకారా నగరాలలో ఎక్కడ చూసినా యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు తిరుగుతూ కనిపిస్తున్నాయి.
టర్కీలో ఉన్న భారతీయులు తమ ఇళ్లలోని ఉండాలని అంకారాలో ఉన్న భారత దౌత్య కార్యాలయం విజ్ఞప్తి చేసింది. అంకారాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకోగోరేవారు +905303142203 లేదా +0905305671095 ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.