జమ్మూ కాశ్మీర్ లో పారంపోర్ వద్ద ఒక ప్రభుత్వ భవనంలో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు సోమవారం మట్టుబెట్టాయి. శనివారం మధ్యాహ్నం నుండి మొదలయిన ఈ ఆపరేషన్ సోమవారం మధ్యాహ్నం వరకు సాగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టిన తరువాత వారి వద్ద అనేక మారణాయుధాలు దొరికాయని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ విక్టర్ ఫోర్స్, మేజర్ జనరల్ అరవింద్ దత్త మీడియాకి తెలిపారు. వారు చాలా పెద్ద యుద్ధానికే సిద్ధపడి వచ్చినట్లు ఆ ఆయుధాలను చూస్తే అర్ధమవుతోందని ఆయన అన్నారు. వారు లష్కర్ ఉగ్రవాదులని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ ముగిసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అయన ప్రకటించారు. ఆ ఐదు అంతస్తుల భవనంలో 44 గదులను భద్రతాదళాలు క్షుణ్ణంగా తణికీలు చేస్తున్నాయి.
కేవలం ముగ్గురు ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు, సి.ఆర్.పి.ఎఫ్. కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక కమెండో, ఒక పౌరుడు మరణించడం గమనిస్తే, ఇటువంటి ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి భద్రతాదళాలు ఇంకా మంచి శిక్షణ, అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవలసి ఉందని తెలియజేస్తున్నట్లుంది. ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతీసారి మన జవాన్లు అనేకమంది మరణిస్తుండటం చాలా బాధాకరమయిన విషయం.
చనిపోయిన ఉగ్రవాదుల వద్ద చాలా ఆయుధాలు దొరికడం కూడా చాలా ఆలోచించవలసిన విషయమే. ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఆ దారిన వెళుతున్న సి.ఆర్.పి.ఎఫ్. వాహనంపై మొదట దాడి చేసారు. ఆ తరువాతే వారు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనంలోకి ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులే చెపుతున్నారు. మరి అటువంటప్పుడు వారి వద్ద నుండి చిన్నపాటి యుద్ధం చేయడానికి సరిపడేటన్ని మారణాయుధాలు ఏవిధంగా దొరికాయి? అంటే వారు ఈ దాడికి చాలా రోజుల ముందు నుంచే ఆ ప్రభుత్వ భవనంలోకి ఆయుధాలను తరలించడం మొదలుపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. లేకుంటే ముగ్గురు ఉగ్రవాదులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంత భారీ ఆయుధ సామాగ్రిని మోసుకొని ఆ భవనంలోకి చేర్చడం సాధ్యమేనా? అనే సందేహం కలుగుతోంది. కనుక ఈ దాడుల నుండి ప్రభుత్వం, భద్రతాదళాలు కూడా చాలా పాఠాలు నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది.