ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సకల జనుల సమరభేరి సభ సక్సెస్ అయిందనే చెప్పాలి. నిజానికి, ఒక్క రోజు ముందే ఈ సభకు కోర్టు నుంచి అనుమతులు వచ్చినా, హైదరాబాద్లో జరిగిన సభకు దాదాపు 15 వేలకుపైగా హాజరయ్యారు. కార్మిక సంఘాల నాయకులతోపాటు, కాంగ్రెస్, భాజపా, టీడీపీ, టీజేయస్, కమ్యూనిస్టు నేతలు కూడా సభలో పాల్గొన్నారు. ఆర్టీసీని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏయే వ్యాఖ్యలు చేశారో, వాటిపై ఒక్కోటిగా కార్మికులకు స్పష్టత ఇచ్చే విధంగా జేయేసీ నాయకులు మాట్లాడారు. కార్మికుల్లో ఐక్యత సడలిపోకుండా ఉంచాలానే లక్ష్యంతో వారి ప్రసంగాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, వీ హన్మంతరావు ప్రసంగాలు ప్రధానంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏయే సంఘాలైతే ప్రముఖంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయో, దాదాపు ఆయా సంఘాలన్నీ ఇప్పుడు మరోసారి ఏకమై ఒకే వేదిక మీదికి వచ్చాయి. అంతేకాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ తరహా నిరసన కార్యక్రమాలు నిర్వహించారో, ఇప్పుడూ అదే తరహా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. సడక్ బంద్, రోడ్లపై వంటావార్పులు, మానవహారాలు వీటితోపాటు మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలను నిర్మించే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆర్టీసీ జేయేసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అయితే, ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది మరో రెండ్రోజుల్లో అన్ని రాజకీయ పక్షాలూ, సంఘాలతో చర్చించి తేదీలను ప్రకటిస్తామన్నారు. ఇంకా వినతి పత్రాలు, చిన్నచిన్న ధర్నాలతో నిరసనలు తెలిపితే సరిపోదనీ, ఉద్యమ తీవ్రతను పెంచాల్సి ఉందన్నారు.
ఈ సభ సక్సెస్ కావడంతో కార్మికుల్లో కొంత భరోసా కలుగుతుందని చెప్పొచ్చు. దీనికి తోడు, కోర్టు కూడా సభకు అనుమతి ఇవ్వడం, సమ్మెను రద్దు చేయాలంటూ తాము చెప్పలేమంటూ వ్యాఖ్యానించడం.. న్యాయం తమవైపు ఉందీ అనే నమ్మకం పెంచడంతోపాటు, డిమాండ్లు సాధించుకుంటామనే ధీమాను జేయేసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సాగరహారం, మిలియన్ మార్చ్ తరహా కార్యక్రమాలు ఆర్టీసీ కార్మికులు చేపడితే ముందుండి నడిపించేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ తోపాటు ఇతర పక్షాలూ మద్దతు పలికాయి. దీంతో, ఇకపై ఆర్టీసీ చేపట్టబోయే కార్యక్రమాలు ప్రభుత్వానికి సవాల్ గానే మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెబుతుంది, రేపు కోర్టులో ఏం వాదిస్తుంది అనేది కాస్త ఆసక్తికరంగానే మారిందని చెప్పొచ్చు.