దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశపై అత్యాచారం, హత్య ఘటన తరువాత ప్రజానీకం, ప్రభుత్వాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యాధికుల ముందు మిలియన్ డాలర్ల ప్రశ్నలు విశ్వరూపం దాల్చి నిలుచున్నాయి. వాటికి జవాబు దొరకుతుందా? పట్టుబట్టి జవాబు వెదుకుతారా? కనీసం వెదికే ప్రయత్నం చేస్తారా? ‘ఎప్పటి మాదిరిగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు’ అనే చందమామా కథ టైపులో నిర్లిప్తంగా ఉంటారా? ఎంతకీ ఏమిటా మిలియన్ డాలర్ల ప్రశ్నలు? నిర్భయ, దిశలాంటి కేసుల్లో దోషులకు ఎలాంటి శిక్ష విధించాలి? ఎలాంటి శిక్షలు వేస్తే ఇలాంటి పైశాచిక ఘటనలకు తెర పడుతుంది? ఈ దేశంలో ఇలాంటి వికృతాలు జరగకుండా చూడగలమా? ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఒకటి కాదు, రెండు కాదు అనేకం తెరమీదికి వస్తున్నాయి.
శిక్షలే కాదు, త్వరితగతిన విచారణ జరపలేమా? జరిపిన తరువాత వెంటనే శిక్షలు విధించలేమా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. సాధారణ ప్రజానీకమే కాదు, అత్యున్నత చట్టసభ పార్లమెంటులో సైతం రాజీకీయాలకు అతీతంగా సభ్యులంతా ‘దోషులను వెంటనే ఉరి తీయాలి’…అంటూ ముక్తకంఠంతో నినదించారు. ఇలా నినదించి, ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి ప్రయోజనం ఏముంది? పైన వేసుకున్న ప్రశ్నలన్నింటికీ జవాబులు వెదకాల్సిన బాధ్యత, రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు సభ్యులకే ఉంది. ఇప్పుడున్న చట్టాలు చాలవనుకుంటే కఠిన చట్టాలు తయారుచేసి, వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు సభ్యులకు, ప్రభుత్వాలకు ఉంది.
నిర్భయ కేసులో దోషులకు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు సమర్ధించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదో జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిర్భయ తల్లి ‘మాకు న్యాయం జరగలేదు. దిశ కుటుంబానికైనా న్యాయం చేయాలి’ అని కోరుకుంది. ఆమె ఆవేదనను ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఎందుకు అర్థం చేసుకోవడంలేదు? దిశ ఘటనపై పార్లమెంటు దద్దరిల్లిన సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. దోషులకు మరణశిక్ష పడినప్పుడు ఇంకా వారిని క్షమాభిక్ష కోరుకోమనడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. వారు ఘోరమైన, దారుణమైన నేరం చేశారనే కదా మరణశిక్ష విధించింది? అంటే క్షమించడాకి కూడా దోషులు అర్హులు కారని అర్థం.
మరి అలాంటప్పుడు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞాపన పంపడం ఏమిటి? ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అసలు క్షమాభిక్ష అనే ఆలోచనకే తావు లేకుండా చేయాలి. అసలు ఒక కేసు కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా తిరగడం అవసరమా? అనే ప్రశ్న కూడా తెర ముందుకు వచ్చింది. కింది కోర్టులో పడిన శిక్ష సుప్రీం కోర్టు దాకా వెళ్లేసరికి ఏళ్లూ పూళ్లూ పట్టడమే కాకుండా స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. కింది కోర్టు దోషులని తీర్పు చెప్పినవారు సుప్రీం కోర్టుకు వెళ్లేసరికి నిర్దోషులుగా మారుతున్నారు. నిర్దోషులు దోషులుగా మారుతున్నారు.
నిర్భయ, దిశ వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడమనే విధానం సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉండకూడదంటున్నారు. మన దేశంలో అత్యాచార కేసుల్లో దోషులైనవారికి కఠిన శిక్షలు విధించకపోవడంవల్లనే అత్యాచారాలు ఆగడంలేదనే వాదన కొన్ని రోజులుగా విస్తృతంగా జరుగుతోంది. నిర్భయ కేసులో దోషులను ఉరితీయకపోవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అందుకే మొన్న దిశ కేసులో నిందితులను పట్టుకున్నప్పుడు ‘వాళ్లను మాకు అప్పగించండి. శిక్ష మేం వేస్తాం’ అని జనం దిక్కులు పిక్కటిల్లేలా డిమాండ్ చేశారు.
ఇలాంటి కేసుల్లో దోషులకు కోర్టుల్లో సరైన శిక్షలు పడవని జనం నిర్థారణకు వచ్చేశారు. ‘అత్యాచారం కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయాలి’ అని ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రానికి విరుద్ధం కాదు కూడా. దిశ ఘటన తరువాత కూడా అత్యాచారాలు, హత్యలు ఆగడంలేదని ఆరోజు నుంచి ఈ రోజు వరకు పత్రికలు చూస్తే అర్థమవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి?