హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలోని మీర్ చౌక్, అజంపూరా ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మీర్ చౌక్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై, అజంపూరాలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడు అజాం అలీపై మజ్లిస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
మీర్ చౌక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్, మజ్లిస్ ఎమ్మెల్యే ఖాద్రికి మధ్య జరిగిన గొడవతో వివాదం ప్రారంభమయింది. ఆ నాయకులు ఇద్దరినీ మీర్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు – పీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గౌస్‌ను విడిపించటానికి స్టేషన్‌కు వెళ్ళారు. గౌస్‌ను విడిపించుకుని కాంగ్రెస్ నాయకులు వెళుతుండగా అక్కడికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అక్కడకు చేరుకున్నారు. ఉత్తమ్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు. అసదుద్దీన్ ఉత్తమ్ కారు అద్దాలు పగలగొట్టటంతోపాటు షబ్బీర్ అలీని పక్కకు తోసేశారు. షబ్బీర్ అలీపై మజ్లిస్ కార్యకర్త దాడి చేయటం మీడియాలో స్పష్టంగా కనబడింది. ఉత్తమ్, షబ్బీర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారు మళ్ళీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అసద్‌పై ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో అక్రమంగా గెలవటంకోసం అరాచకాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. మజ్లిస్ పార్టీ అనేకచోట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందని అన్నారు. పురానాపూల్ ప్రాంతంలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అజంపూరాలో మహమూద్ అలీ నివాసంపై మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తమ కుమారుడు అజం అలీ గాయపడ్డాడని డిప్యూటీ సీఎమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బలాలాను అరెస్ట్ చేశారు. అయితే టీఆర్ఎస్ కార్యకర్తలే తమపైన దాడికి పాల్పడ్డారని ఎమ్ఐఎమ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.