తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ముఖ్యంగా మున్సిపల్ చట్టాన్ని సభ ఆమోదించి, చర్చిస్తుంది. అయితే, ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా ఉండటం ప్రత్యేకం. ఎందుకంటే, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని తెరాస ఎల్పీలో విలీనం చేశారు. దీంతో సభలో అధికారిక ప్రతిపక్షమంటూ ఏదీ లేకుండా పోయింది. దీంతో, ఆ హోదా తమకే ఇవ్వాలంటూ మజ్లిస్ పార్టీ కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. అయితే, మూడింట రెండొంతుల మంది సంఖ్యాబలం సభలో ఉంటే తప్ప, సాంకేతికంగా ఆ హోదాను ఇవ్వడం సాధ్యం కాదు. కానీ, అప్రకటితంగా మజ్లిస్ పార్టీకే ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని అధికార పక్షం ఇచ్చిందనేది తాజా సమావేశాలను గమనిస్తే అర్థమౌతుంది.
గతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉండేది, ఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క వ్యవహరించేవారు. సహజంగానే, ఏదైనా కొత్త బిల్లును సభలో మంత్రులుగానీ, ముఖ్యమంత్రిగానీ ప్రవేశపెట్టినప్పుడు… దాని మీద చర్చ కొనసాగించండని స్పీకర్ కోరతారు. దానికి స్పందించి, ప్రతిపక్ష నాయకుడు లేచి చర్చకు అవకాశం ఇవ్వాలంటూ సభాపతి అనుమతి తీసుకుని… ఆ బిల్లుపై తొలిగా డిస్కషన్ ప్రారంభిస్తారు. ముందుగా ప్రతిపక్షం మాట్లాడితే, వాటికి కౌంటర్ గా ప్రభుత్వం సమాధానాలు చెబుతుంది. ఇప్పుడు అసెంబ్లీ ప్రతిపక్షమే లేదు కాబట్టి, ఆ సంప్రదాయం ఉండదనే అనుకున్నాం. సభలో హోదా కోల్పోయారు కాబట్టి, భట్టి విక్రమార్కకు ఈసారి చర్చను ప్రారంభించే అవకాశం ఎలాగూ లేదు. దీంతో ఆ సంప్రదాయం జోలికి వెళ్లకుండా అధికార పార్టీయే చర్చను ప్రారంభిస్తుందేమో అనుకున్నాం.
కానీ, సభలో తెరాస తరువాత ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీగా మజ్లిస్ ఉంది. అధికారికంగా వారికంటూ ప్రతిపక్ష పార్టీ హోదా లాంటిదేదీ లేదు. అయినాసరే, మజ్లిస్ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకి మాట్లాడే అవకాశాన్ని సభాపతి ఇచ్చారు. దీంతో, సభలో వెంటనే కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయలేదుగానీ… బయటకి వచ్చాక కొంతమంది నాయకులు తెరాస తీరుపై విమర్శలు చేశారు. సీఎల్పీ విలీనంపై సభలో కాంగ్రెస్ సభ్యులు కొంత నిరసన వ్యక్తం చేశారు. సేవ్ డెమొక్రసీ అంటూ ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చర్చ ప్రారంభించే అవకాశాన్ని మజ్లిస్ కి తెరాస ఇవ్వడం ఒక ప్రత్యేకమైన సందర్భంగానే చూడాలి.