బీహార్లో విజయం ఖాయం అనుకున్న ఆర్జేడీ కూటమికి ఫలితాల్లో షాక్ తగిలింది. విజయానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. అలా అని భారతీయ జనతా పార్టీ కూటమికి తిరుగులేని మెజార్టీ ఏమీ రాలేదు. ఒకటి, రెండు సీట్లు తక్కువే వచ్చాయి. విజయం ఖాయమనుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి విజయాన్ని దూరం చేసిన కారణం.. అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బీహార్ ఎన్నికల్లో ఫలితాన్ని తారుమారు చేసేశారు. భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణంగా మారారు. అసదుద్దీన్ ఓవైపు తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తానని.. ఎన్నికలు జరుగుతున్న ప్రతీ చోటా పోటీ చేస్తున్నారు.
పోటీ చేసిన దగ్గరల్లా.. ముస్లింల ఓట్లను భారీగా చీల్చి..భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తున్నారు. ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది. ముస్లిం జనాభాఎక్కువ ఉన్న చోటల్లా.. ఎంఐఎం తరపున అభ్యర్థుల్ని నిలబెట్టారు ఓవైసీ. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఆధిక్యం కనబరుస్తున్న ఎంఐఎం.. కనీసం ఇరవై చోట్ల కాంగ్రెస్ పార్టీ తో పాటు.. ఇతర కూటమి అభ్యర్థుల పరాజయానికి కారణంగా నిలిచింది.
ఎంఐఎం పోటీలో లేకపోతే ఆ ఓట్లన్నీ మహాకూటమికే పడేవి. కానీ ఇప్పుడు ఆ ఓట్లను ఆ కూటమికి పడకుండా చీల్చడం ద్వారా.. ఇరవై సీట్లలో బీజేపీ కూటమి గెలుపునకు ఎంఐఎం సహకరించినట్లయింది. ఈ విషయమే గుర్తు చేసుకుని కాంగ్రెస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. కానీ.. చేయగలిగిందేమీ లేదు. ఇప్పటికే చేతులు కాలాయి మరి..!