ఇంతవరకు కేవలం తెలంగాణాకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ, గతేడాది జరిగిన ఎన్నికలలో మహారాష్ట్రాలో రెండు సీట్లు గెలుచుకొంది.క్రమంగా దేశంలో అన్ని రాష్ట్రాలలోను తమ పార్టీని విస్తరించాలని ప్రయత్నిస్తున్న మజ్లీస్ పార్టీ త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు మరొక మంచి అవకాశం కల్పించాయి. బీహార్ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసద్దుద్దీన్ ఒవైసీ నేడు ప్రకటించారు. తమ పార్టీ మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ముస్లిములు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో మజ్లీస్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు అసద్దుదీన్ సూచించారు. తమ పార్టీ గెలిస్తే సీమాంచల్ అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇంతవరకు బీహార్ లో ముస్లిం ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లేదా కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తూ వచ్చారు. కానీ మజ్లీస్ పార్టీ అడుగుపెడితే మొత్తం ముస్లిం ప్రజలందరూ దానికే మరిలిపోయే అవకాశం ఉంటుంది కనుక మజ్లిస్ పార్టీ ప్రవేశంతో ఆ మూడు పార్టీల విజయావకాశాలపై విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే తనను తాను ‘ములాయం ఖాన్’ గా అభివర్ణించుకొంటూ ముస్లిం ప్రజల ఓట్లు సంపాదించుకొంటున్న ములాయం సింగ్ కూడా మజ్లీస్ పార్టీ ప్రవేశంతో తీవ్రంగా నష్టపోవచ్చును. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, జనతా పరివార్, వామపక్ష కూటమి బరిలో ఉన్నాయి. ఇప్పుడు వాటికి మజ్లీస్ పార్టీ కూడా తోడయింది. ఇవి కాక అనేకమంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో ఉండటం ఖాయం కనుక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ జనతా పరివార్ లో మళ్ళీ చీలిక వచ్చినట్లయితే ఓట్లు చీలిపోయే అవకాశం ఇంకా ఎక్కువవుతుంది.