హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర పడిపోవటంతో చల్లగాలులు నగరవాసులను గజగజలాడిస్తున్నాయి. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలుగా నమోదుకాగా, శనివారం అది ఒకేసారి 12.5 డిగ్రీలకు పడిపోయింది. అంటే నగరంలో ఉష్ణోగ్రత ఒకేరోజులో ఐదు డిగ్రీలు కిందకు పడిపోయింది. నగరవాసులు నీళ్ళు ముట్టుకోవాలంటే గజగజలాడిపోతున్నారు. బయటకు రావటానికి మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు తప్పనిసరిగా ధరించాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్ర, రాత్రి వేళల్లో బయటకు రావటానికి జనం భయపడిపోతున్నారు. సాయంత్రం సమయంలో ప్రధాన కూడళ్ళు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాకింగ్‌కు వెళ్ళేవారి సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈసారి డిసెంబర్ చివరి వారంలోనే చలి పుంజా విసురుతుండటంతో రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చలి తీవ్రతతో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఐదుగురు చనిపోయారు. అదిలాబాద్‌లో 4, మెదక్‌లో 8, రామగుండంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర, వాయువ్య దిశనుంచి వీస్తున్న శీతల గాలులే దీనికి కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో 5 రోజులు చలిగాలి ఉధృతి ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు.