కడప జిల్లాలో ముగ్గురాళ్ల గనిలో పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పది మందికి ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. పది లక్షల పరిహారం ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా ప్రకటించారు. అదే గొప్ప సాయం అన్నట్లుగా ఆయన చెబుతున్నారు కానీ.. ప్రైవేటు వ్యక్తులు చేసిన తప్పిదానికి ప్రభుత్వ సొమ్ము.. అంటే ప్రజాధనం ఎందుకు పరిహారంగా చెల్లిస్తున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. కడప జిల్లాలో జరిగిన ముగ్గురాయి గని వద్ద జరిగిన ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే.. ఆ గనికి అనుమతుల్లేవ్. పేలిపోయిన జిలెటిన్ స్టిక్స్ కొనడానికి అనుమతుల్లేవు. వాటిని రవాణా చేయడానికి అనుమతుల్లేవు. అంతకు మించి వాటిని ఉపయోగించడానికి ఎవరి దగ్గరా పర్మిషన్ తీసుకోలేదు.
పైగా జిలెటిన్ స్టిక్స్ లాంటి వాటిని నిపుణులైన వ్యక్తులతో పేల్చాలి.. అలాంటి వారిని కూడా.. ఆ గని కార్మికులు పెట్టుకోలేదు. అక్కడ పని చేస్తున్న వారందర్నీ రిస్క్‌లో పెట్టేసి.. ఈ వ్యవహారం అంతా.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. మామూలుగా అయితే తక్షణం.. ఆ గని ఎవరు లీజుకు తీసుకున్నారో.. వారిని అరెస్ట్ చేయడం పోలీసుల విధి. సబ్ లీజుకు ఎవరైనా తీసుకుని నిర్వహిస్తే.. వారినీ తక్షణం అదుపులోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ గని.. వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య పేరు మీద ఉంది. ఆ గనిని మరో వైసీపీ నేత డబ్బు సంపాదనకు తవ్వుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించడం లేదు. కానీ పెద్ద ఎత్తున బాంబులతో తవ్వి.. ముగ్గురాయిని తరలిస్తున్నారు.
వీటన్నింటిపై పక్కా సాక్ష్యాధారాలున్నాయి. కానీ ఎవరిపైనా తక్షణ చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఐదు డిపార్టుమెంట్లతో కమిటీలు వేశామని.. ఐదు రోజుల్లో నివేదిక ఇస్తారని.. ఆ తర్వాత తప్పు చేసిన వారి సంగతి తేలుస్తారన్నట్లుగా చెబుతున్నారు. అప్పటికి అందరూ మర్చిపోతారన్న ఉద్దేశంతోనే ఈ కాలయాపన జరుగుతుంది. ఐదు రోజుల తర్వాత మరో నెల రోజులు ఆ గడువు పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రజాధనమే తలా పది లక్షలు ఇచ్చేసి.. సర్దుబాటు చేస్తున్నారు కాబట్టి.. అదే ప్రభుత్వం చేయగలిగిన పని అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ గని నుంచి వైసీపీ నేతలు ధనం పిండుకుంటున్నారు కాబట్టి. వ్యవస్థలు పాక్షికతతో పని చేయడానికి ప్రభుత్వంలోని వ్యక్తుల వ్యవహారశైలే ప్రధాన కారణం. కడప జిల్లాలో జరిగినప్రమాదంలో అదే కనిపిస్తోంది.