ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డిపై విశాఖలో జరిగిన కత్తి దాడి ఒక క్రియేషన్ అని అభివర్ణించారు ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. అమరావతిలో ఒక ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ… జగన్ కి తగిలిన గాయం కందిరీగ కుట్టిన దానికంటే తక్కువ అన్నారు. తమ అంచనా ప్రకారం జగన్ కి గాయాన్ని కుట్లు అనేవి క్రియేషన్ వన్ అనీ, ఆసుపత్రిలో హడావుడి చేయడం క్రియేషన్ టు అనీ, ఇప్పుడా గాయానికో కట్టు అనేది క్రియేషన్ త్రీ అంటూ మంత్రి ఆది నారాయణ విమర్శించారు. చేతికి బలమైన గాయం తగిలితే ఎవరైనా వెంటనే ఆసుపత్రికి పోతారనీ, వైజాగ్ లో మంచి ఆసుపత్రులు చాలా ఉన్నా కూడా జగన్ ఎక్కడికీ పోకుండా, నవ్వుతూ హైదరాబాద్ వచ్చేశారన్నారు. ఇదంతా సినిమా క్రియేషన్ అని ఎద్దేవా చేశారు.
ఈ గాయాన్ని ఒక సినిమాగా నడిపించాడనీ, జగన్ తో తాను పక్కనే కొన్నాళ్లుగా ఉంటూ వచ్చాను కాబట్టి, జగన్ తీరేంటో తనకు ప్రత్యక్షంగా తెలుసునీ, వ్యక్తిగతంగా చాలాసార్లు చూసి ఆశ్చర్యపోయానని ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను దగ్గరుండి చాలాసార్లు జగన్ కు నచ్చజెప్పాననీ, ‘వద్దు సామీ ఇలాంటి తప్పులు చెయ్యొద్దని చాలా సందర్భాల్లో చెప్పా’నన్నారు. దాంతో అక్కడి నుంచి తనను దూరం పెట్టడం మొదలుపెట్టారనీ, అందుకే ఆ తరువాత టీడీపీలోకి వచ్చానని ఆది నారాయణ రెడ్డి చెప్పారు.
జగన్ పై కత్తి దాడి అంశమై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, జరిగింది ఎంత చిన్నటి పొరపాటు అయినా దానిపై వాస్తవాలు ప్రజలకూ తెలియాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై తామేదో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన సరిపోదు కదా అనీ, దానిపై ఆధారాలతో చూపించాల్సిన బాధ్యత తమకు ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కోర్టు ఉందనీ, కాబట్టి వాస్తవాలన్నీ బయటకి వస్తాయనీ, దీన్ని ప్రాణానికి సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నామన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడు ఇప్పుడో ఇల్లు నిర్మించుకుంటున్నాడనీ, అతడికి అంత ఆర్థిక స్థోమత ఎక్కడ్నుంచీ వచ్చిందీ, ఆయన వాడిన సిమ్ కార్డుల నుంచి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడికి ఫోన్లు పోయాయి అనేది కూడా అన్నీ స్పష్టంగా బయటకి రావాల్సి ఉందన్నారు మంత్రి.
జగన్ ఎవరి మాటా వినరు, పార్టీలో ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరు, తన నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలనే ధోరణిలో ఉంటారనేది గతంలో కూడా చాలాసార్లు ఇలా చర్చకు వచ్చిన అంశమే. ఇప్పుడు మంత్రి ఆది నారాయణ అదే తరహా అనుభవాన్ని మరోసారి చెప్పారు.