ఏపీ టూరిజం మంత్రి అఖిల ప్రియ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు! విజయవాడలోని టూరిజం అథారిటీ కార్యాలయానికి మంత్రి వచ్చారు. సిబ్బందిని పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. పనివేళలను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకం అభివృద్ధికి కృషి చేయాలనీ, అలసత్వం ప్రదర్శించేవారిపై చర్యలు ఉంటాయని కూడా మంత్రి హెచ్చరించడం విశేషం! అయితే, ఉన్నట్టుండి మంత్రి అఖిల ప్రియకి ఈ స్థాయి బాధ్యత పెరగడం వెనక తాజా పరిణామాలే కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి, మంత్రిగా ఆమె పనితీరుపై కొన్ని విమర్శలున్నాయి. సచివాలయానికి ఆమె తరచూ రావడం లేదనే ప్రచారం ఉంది. ఒకవేళ వచ్చినా.. రోజంతా ఉండేందుకు పెద్దగా ఇష్టపడరనీ, కొద్ది గంటలు మాత్రమే కార్యాలయంలో ఉంటారనే విమర్శ ఉంది. దీంతో ఆమె శాఖలో ఫైళ్లు పెండింగ్ పడిపోతున్నాయనీ, వాటిని ముఖ్యమంత్రి కార్యాలయమే క్లియర్ చేయాల్సి వస్తోందని కూడా కొందరు చెబుతారు!
సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రచారంలోకి వస్తున్నాయంటే… కృష్ణా నదిలో పడవ ప్రమాదం తరువాత, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందంటూ కొంత ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని చెబుతూనే, ఆమెను క్యాబినెట్ నుంచి తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించారు. అయితే, ప్రమాదం విషయమై ముఖ్యమంత్రి సీరియస్ గానే ఉన్నారనీ, కారణమైన బాధ్యులను ఉపేక్షించేది లేదని నారా లోకేష్ చెప్పారు. అఖిల ప్రియ సమర్థంగా పనిచేస్తున్నారనీ.. వివిధ కార్యక్రమాల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు!
మంత్రి లోకేష్ వివరణ ఇలా ఉంటే… మంత్రి అఖిల ప్రియ పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కొంతమంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంత ఘోర ప్రమాదం జరిగితే, మరొకరైతే ఈపాటికి మంత్రి పదవికి రాజీనామా చేసేవారంటూ సీఎం ఘాటుగా స్పందించారని కూడా చెప్పుకుంటున్నారు. అఖిల ప్రియ పనితీరుపై మొదట్నుంచీ సీఎంకు కాస్త అసంతృప్తి ఉందనీ, అందుకే ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. దానికి ఫలితమే మంత్రి అఖిల ప్రియ తాజా ఆకస్మిక తనిఖీల పేరుతో విజయవాడకు వెళ్లారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా పనితీరు మెరుగుపరచుకుంటేనే బాగుంటుందనే సంకేతాలు సీఎం నుంచి వ్యక్తమైనట్టుగా చెప్పుకుంటున్నారు.