ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ నెల రోజుల క్రితమే వెలుగు చూసింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఉన్నా లైట్ తీసుకుంది. కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా.. ఏపీ సర్కార్ అదేమి లేదని.. వాదిస్తూ వచ్చింది. కానీ ఇవాళ మాత్రం.. హఠాత్తుగా నిజంగానే డెల్టా ప్లస్ కేసు నమోదయిందని.. మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. అంతే కాదు.. ఇది నెల క్రితమే నమోదయిందని.. చికిత్స తర్వాత కోలుకున్నారని తీరిగ్గా చెప్పుకొచ్చారు. ఓ వైపు ప్రపంచం మొత్తం ఆ వేరియంట్ చాలా ప్రమాదకమని చర్చ జరుగుతున్న సమయంలో.. ఏపీసర్కార్ ఇంత తేలిగ్గా తీసుకోవడం సంచలనం అవుతోంది.
కేంద్రం ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో.. డెల్టా ప్లస్ వేరియంట్‌కు గురైన వ్యక్తి ఇంటి దగ్గర 30 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. తిరుపతిలో డెల్టా ప్లస్ ఇప్పటికే వ్యాపించి ఉండొచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. మరో వైపు.. ఈ వేరియంట్ మహారాష్ట్రపై ఎటాక్ చేస్తోంది. డెల్టా ప్లస్‌తో ఓ రోగి చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో మహారాష్ట్ర సర్కార్ వెంటనే .. చర్యలు ప్రారంభించింది.
పుణెతో పాటు ధానెలోనూ ఆంక్షలు విధించింది. కేంద్రం.. ఈ వైరస్‌పై నిపుణుల బృందం ప్రత్యేకంగా పరిశీలన చేస్తోందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 48 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. తిరుపతిలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండు నెలల కిందటే వెలుగు చూడటం.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం.. ఇప్పుడు.. ఇబ్బందికరంగా మారింది. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాపించి ఉంటే… ఏపీ మరింత గా కరోనా కోరల్లో చిక్కుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.