ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించాలని అనుకుంటోంది. ఎలాన్ మస్క్.. టిమ్ కుక్ లను పిలుస్తున్నామని ప్రకటించుకుంది. వారు వస్తారో రారో కానీ.. ఇదిగో వచ్చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఏపీ నుంచి ఓ ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లి వారికి ఆహ్వానపత్రం ఇవ్వడానికి కూడా అపాయింట్మెంట్ దొరకదు. కానీ వారు.. దావోస్ లో కనిపిస్తారు. ప్రపంచపెట్టుబడిదారుల సదస్సుకు వారు మాత్రమేకాదు.. ప్రపంచవ్యాప్త దిగ్గజాలందరూ వస్తారు. అందరూ ఒకే చోట చేరుతారు. అలాంటప్పుడు. ఏపీ పెవిలియన్ ఒకటి పెట్టి.. ఘనంగా ప్రమోట్ చేసుకుని మార్చిలో మా దగ్గర సదస్సు ఉందిరావాలని పిలిస్తే .. కొంత మంది అయినా వస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం సదస్సుకు వెళ్లలేదు.
ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారంటే.. మంత్రిగారి సమాధానం.. విశాఖ సదస్సును దిగ్గజాలను ఆహ్వానించాలనే వెళ్లలేదని చెప్పుకొస్తున్నారు. మార్చిలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందునే దావోస్ సదస్సుకు వెళ్లలేదని మంత్రి అమర్నాథ్ చెబుతున్నారు. మార్చిలో చేసే సదస్సు ఏర్పాట్లు ఇంత వరకూ ప్రారంభం కాలేదు. అయినా రెండు రోజుల సదస్సుకు వెళ్లడానికి మార్చిలో సదస్సు ఏర్పాట్లకు సంబంధం ఏమిటో మంత్రే చెప్పాల్సి ఉంది.
కానీ దావోస్ నుంచి ఆహ్వానంరాలేదన్న విమర్శలు వస్తూండటంతో మంత్రిగా ఉడుక్కుని ప్రెస్ మీట్ పెట్టారు. ఆహ్వానం వచ్చిందని ఓ లేఖ బయట పెట్టారు. అయితే అందులోనూ ఉన్న వివరాలపై నెటిజన్లు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఆహ్వానం వచ్చిందనుకున్నా… ఎందుకు వెళ్లలేదంటే మాత్రం .. ఈ లాజిక్ చెబుతున్నారు. అదనంగా చంద్రబాబు, పవన్ పై తిట్ల దండకాలు ఎలాగూ ఉంటాయి.