తిరుమలలో లడ్డూ వివాదం, నాటి చైర్మన్ల పనితీరుపై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, చైర్మన్ తో పాటు మెంబర్ల ఎంపిక చాలా కష్టమైన పని. ఎంతో ఒత్తిడి, పోటీ ఉంటుంది. ఇటీవల ఓ సమావేశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ ఇదే అంశాన్ని చెబుతూ… వేల మంది ఒక్క టీటీడీ బోర్డు కోసమే పోటీ పడుతున్నారని కామెంట్ చేశారు.
కొత్త ప్రభుత్వం రాగానే కొత్త బోర్డు వస్తుందని అంతా భావించారు. ఈలోగా… తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వివాదం. దీంతో బోర్డు ప్రకటన ఇప్పట్లో ఉంటుందా? అన్న చర్చ ప్రారంభం అయ్యింది. ప్రభుత్వం కూటమిలోని పార్టీల బలాబలాలను బట్టి 20నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా ప్రకటించింది. దీంతో టీటీడీ బోర్డు ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటనపై సీఎం కసరత్తు చేస్తున్నారని… తిరుమల పవిత్రతను కాపాడేలా బోర్డు చైర్మన్, సభ్యులు ఉంటారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప్రకటించారు. టీటీడీతో పాటు రాష్ట్రంలో ఉన్న 27వేల దేవాలయాల పాలకమండళ్లను సైతం త్వరలోనే ఫైనల్ చేసి, ప్రకటన విడుదల చేయబోతున్నారన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తయ్యాక, ఆ నివేదికను బట్టి తిరుమలలో కల్తీ చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ప్రకటించారు. దీనికి, కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుకు సంబంధం ఉండదన్నారు.