ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరమణ, భార్య సూర్యకుమారి వారు కుమారుడు, కుమార్తెతో కలిసి హైదరాబాద్ ఫిలిం నగర్ లో నివాసం ఉంటున్నారు.వీరి కుమారుడు స్కూటీ తీసుకొని బయటకు వెళ్ళగా.. ఫిలింనగర్ దర్గా సమీపంలో మంత్రి బుగ్గన కారుకు స్కూటీ తగిలింది. ఆ సమయంలో కారులో బుగ్గన కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతో వెంటనే కారు దిగిన బుగ్గన డ్రైవర్… బాలుడి స్కూటీ తాళాలు లాక్కొని , మరో డ్రైవర్ ను పిలిపించి అతనికి వార్నింగ్ ఇచ్చారు. 20వేలు ఇచ్చి స్కూటీ తాళాలు తీసుకెళ్ళు అంటూ గద్దించారు. తన దగ్గర అంత మొత్తంలో లేవని వేడుకున్నా వినకపోవడంతో స్కూటీతోపాటు బాలుడిని బుగ్గన ఇంటికి తీసుకెళ్ళారు. బాలుడిని అక్కడే ఉంచి తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.
20వేలు ఇవ్వాల్సిందేనని.. లేదంటే మీ కొడుకుపై కేసు పెడుతామని బెదిరించారు. కంగారుపడిన వెంకటరమణ అతని భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. సడెన్ గా అంత మొత్తంలో ఇచ్చుకోలేమని, వాయిదాల పద్దతినా ఇస్తామని బాలుడి తల్లి చెప్తున్నా బుగ్గన కారు డ్రైవర్ పట్టించుకోలేదు. పైగా… మీ కొడుకు మైనర్. లైసెన్స్ లేని మీ కొడుకు జైలుకు వెళ్తే బయటకు రాడంటూ బెదిరించారు. దాంతో ఒక్కగానొక్క కొడుకును ఎలా కాపాడుకోవాలని మధనపడిన అతని తల్లి మానసిక ఆందోళనకు గురి అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా బెదిరింపులకు పాల్పడటంతో సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే , కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిబంధనల ప్రకారం రెండు వాహనాల నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది కానీ, స్కూటీ నెంబర్ మాత్రమే పేర్కొన్నారు. ఏపీకి చెందిన మంత్రి వాహనం కావడంతోనే పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.