విశాఖను రాజధానిగా అంగీకరించని వాళ్లంతా రాక్షసులేనని తెగ హడావుడి పడిపోతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు అసలు నిర్వాకం .. సిట్ రిపోర్టుల్లో భద్రంగా ఉంది. ప్రభుత్వం విశాఖలో భూదందాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తు బృందాల రిపోర్టుల్లోనే ధర్మాన నిర్వాకం వెలుగు చూసింది. మంత్రిగా ఉన్నప్పుడు మాజీ సైనికుల పేరుతో కొంతమంది కి భూములు కేటాయించి.. వారికి అమ్ముకునే అవకాశం కల్పించి.. వెంటనే.. తామే కొనేశారు. ఈ దందా సాక్ష్యాలతో సహా సిట్ రిపోర్టులో ఉంది.
ధర్మాన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదని అంటున్నారుకానీ.. ఆయన మాత్రం ఆర్థికంగా ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి సాధించారు. వందలు, వేల కోట్ల ఆస్తి పరుడయ్యారు. గత ఇరవై ఏళ్లలో ఇటు ధర్మాన.. అటు బొత్స దాదాపుగా పదిహేనేళ్లు మంత్రిగా ఉన్నారు. కానీ వారు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు కానీ.. తమ ప్రాంతాన్ని తాము కొంత దోచుకుని … ఇతరులు మరికొంత దోచుకోవడానికి మాత్రం సహకరించారు. ఇన్నేళ్ల అధికారంలో ప్రజలు ఎప్పుడూ గుర్తుకు రాలేదు.కానీ ఇప్పుడు రాజధాని వస్తే అందరూ బాగుపడిపోతారని చెబుతూ కొత్త దోపిడికి రెడీ అవుతున్నారు
సిట్ రిపోర్టును ఇంత వరకూ ప్రభుత్వం బయటపెట్టలేదు. ధర్మానపై కేసులు పెట్టి జైలుకు పంపాల్సి వస్తుందన్న కారణంగా ఈ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిట్ రిపోర్టుల్ని బయట పెట్టాలని అదే పనిగా డిమాండ్ వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కబ్జాదారుల్ని కాపాడి… తాము కొంత కబ్జా చేసిన భూముల్ని నిలబెట్టుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కబ్జాలను దాచి పెట్టేందుకే మూడు రాజధానుల నాటకాన్ని వైసీపీ నేతలు ఆడిస్తున్నారు.