ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పించకోవడానికి బహిరంగ ప్రకటనలు చేయడం తప్ప మరో మార్గం లేదనుకుంటున్నారేమో కానీ.. తాను పోటీ చేయనని సీఎం జగన్ రెడ్డికి చెప్పేశానని ..కానీ జగన్ రెడ్డి మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయాలంటే తనకు విసుగెత్తిపోయిందని ధర్మాన చెబుతున్నారు.
కానీ ఆయనకు పరిస్థితి అర్థమయింది కాబట్టి తప్పించుకునేందుకు దగ్గరి దారి వెదుక్కుంటున్నారన్నసెటైర్లు వినిపిస్తున్నాయి. ధర్మాన ఏడాది కిందటే తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. కానీ ఆయన స్థానంలో అభ్యర్థిని వెదుక్కోవడం కష్టమవుతుందో లేకపోతే.. అంత తేలికగా ఎందుకు వదిలి పెడతానని జగన్ రెడ్డి అనుకున్నారో కానీ పోటీ చేసి తీరాల్సిందేనని చెప్పారంటున్నారు. అయితే తనకు బదలుగా తన కుమారుడికి చాన్సివ్వాలని కోరారని.. దానికి జగన్ అంగీకరించలేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పరిస్థితిపై మరింతగా క్లారిటీకి వస్తోంది.
జగన్ రెడ్డి తాను సీటు వద్దంటున్నా సరే నిలబడమంటున్నారని రేపు ఓడిపోతే తనది బాధ్యత కాదని ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నట్లుగా ప్రకటనలు ఉంటున్నాయి. ధర్మానకు మంత్రి పదవి రానంత వరకూ అసంతృప్తి స్వరాలు వినిపించారు. శ్రీకాకుళం జిల్లా విభజనపైనా వ్యతిరేకంగా స్పందించారు. బిల్లులు రావడం లేదన్నారు. అయినా మంత్రి పదవి ఇచ్చేసరికి అన్నింటినీ అణిచివేసుకున్నారు.
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాజధాని పేరుతో రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ప్రజలు మాత్రం… అంత అమాయకులం కాదులే అన్నట్లుగా ఉండటం.. ప్రజాచైతన్యం కనిపించడంతో ఇక ఆటలు సాగవని.. డిసైడయినట్లుగా కనిపిస్తోంది. మరి జగన్ బతిమాలి ధర్మాననే పోటీ చేయిస్తారా లేకపోతే వేరే వ్యక్తిని బరిలోకి తెస్తారా అన్నది చూడాల్సి ఉంది.