వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ఓ సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయానని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్ టూర్ విశేషాలను వివరించేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారు. ఎవరు చెప్పారంటే.. పేపర్లలో చదివామని వాళ్లు చెప్పారని… ఇదంతా కొంతమంది చేసిన విష ప్రచారమని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంత్రిగారిని కలిసిన అ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్త తెలుగు పేపర్లు చదువుతున్నారని.. ఇక్కడ మీడియా చేస్తున్న ప్రచారం గురించి తెలుసుకుని మరీ అమర్నాథ్తో చెప్పడం ఆశ్చర్యకరం అయితే.. అసలు ఆ మునిగిపోయిన వార్తలు ఎవరు చెప్పారన్నది మరింత ఆసక్తికరం. ప్రతీ ఏడాది నాసా విడుదల చేసే రిపోర్టుల్లో ఒక్క విశాఖ మాత్రమే కాదు.. ప్రపంచంలో సముద్రం ఒడ్డున ఉన్న అనేక ముఖ్య నగరాలలో పరిస్థితుల గురించి వివరిస్తూ..
ఓ వందేళ్లకో.. రెండు వందల ఏళ్లకో ఆ నగరం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ జాబితాను ఒక్క తెలుగు మీడియానే కాదు.. జాతీయ..అంతార్జాతీయ మీడియా కూడా ఘనంగా ప్రకటిస్తుంది. లోకల్ పత్రికలు కాబట్టి ఆ జాబితాలో విశాఖ ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఇస్తాయి. దాన్నే గుడివాడ అమర్నాథ్ తన రాజకీయ తెలివితేటలు మిక్స్ చేసి.. ఓ వర్గం మీడియా పనిగట్టుకుని ఈ ప్రాంతం మీద తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఇలా అంటున్నారని తీర్మానించేశారు.
నిజానికి సాక్షి మీడిాయలోనూ ఈ రిపోర్టులు వస్తాయి. ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాలను దావోస్ వెళ్లి చేసుకోవడం ఏమిటి అని వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పలేక.., ఇతర పారశ్రామిక వేత్తలతో ఎందుకు సమావేశాలు నిర్వహించలేకపోయారో మంత్రి చెప్పలేదుకానీ.. మిగతా అన్ని విషయాలు మాట్లాడారు. పెట్టుబడులు ఎందుకు సాధించలేకపోయారంటే… ఇలా ప్రచారం చేశారని చెప్పడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు.