గుడివాడ అమర్నాథ్ పరిస్థితి వైసీపీలో దారుణంగా మారింది. మంగళగిరిలో జరిగిన క్యాడర్ సమావేశానికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో గుడివాడ అమర్నాథ్కు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు పార్టీ క్యాడర్ తో జగన్ సమావేశం మంగళగిరిలో జరుగుతూంటే మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్.. పాయకరావుపేటలో పార్టీ మీటింగ్ పెట్టుకుని అనిత, లోకేష్‌లపై తిట్లందుకున్నారు. పార్టీలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టారని అర్థం కావడంతో.. జగన్ రెడ్డిని, భారతి రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది.
చనువిస్తే చంకన ఎక్కినట్లుగా గుడివాడ అమర్నాథ్ రాజకీయం చేయడంతో.. జగన్ రెడ్డి కట్ చేసి పడేశారు. పవన్ కల్యాణ్ ను ఎలా తిట్టినా.. చంద్రబాబును తిట్టినా.. అవేమీ లెక్కలోకి రాలేదు. వాటితో పాటు తనపై అమితమైన విశ్వాసం చూపించకపోవడంతో జగన్ రెడ్డికి కోపం వచ్చింది. అందుకే అమర్నాథ్ కు టిక్కెట్ చించేశారు. ఇప్పుడు ఆయన వేరే పార్టీలోకి పోలేరు. అందుకే .. జగన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకునేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నారు.
ఇటీవల సీఎం కుర్చీలో కూర్చుని పరిశ్రమలపై అమర్నాథ్ సమీక్ష నిర్వహించడమే అతి పెద్ద శాపంగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డికి ఎవరైనా తన ముందు నిలబడి ఉండాలని అనుకుంటారు. అలాంటిది తాను కూర్చునే కుర్చీలో కూర్చుని సమీక్ష చేయడం ఏమిటని ఆయనకు కోపం తెప్పించి ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాతే మంత్రిగా ప్రోటోకాల్ కూడా తీసేశారు. ఇప్పుడు ఏ సమావేశాలకూ పిలవడం లేదు. టిక్కెట్ ఉంటుందని కూడా చెప్పడం లేదు. టిక్కెట్ ఉండి ఉంటే.. ఈ పాటికి ఫలానా చోట పని చేసుకోమని చెప్పి ఉండేవారని.. అలాంటిదేమీ లేదు కాబట్టి పార్టీ డిప్యూటీ ఇంచార్జ్ పదవి ఇచ్చారని చెబుతున్నారు. అయినా ఆయన సుబ్బారెడ్డి ద్వారా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.