కర్నూలు జిల్లా ఆస్పరిలో మంత్రి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన వందల ఎకరాల భూముల వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే దిసగా మార్చేస్తున్నారు. ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటటంటే.. మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు. ఈ మంజునాత్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత విరమించుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ పత్రం తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు రిజిస్టర్ చేసేశారు.
అయితే ఇప్పుడు ఆయన భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో .. మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయింది., అంత పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. దొంగ పత్రాలతో బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణల్ని విపక్షాలు చేస్తున్నాయి. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన తాను బాధితుడ్నన్నట్లుగా తెర మీదకు వచ్చారు. మోసపోయానంటూ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ ఆ భూముల్ని తనకు కూడా అమ్మిందంటూ మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. ఆయన కూడా ఇట్టినా కంపెనీపై ఫిర్యాదు చేశారు.
అవి నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేశారా.. లేకపోతే బెదిరించి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారా అన్నది దర్యాప్తులో తేలుతుంది. ఏడాదికి మూడు లక్షల ఆదాయం కూడా లేని మంత్రి జయరాం.. పదవి చేపట్టిన కొంత కాలానికే.. అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా రావడంలేదు. ఈ లోపు .. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి.. కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మాత్రం జోరుగా ప్రారంభమయ్యాయని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.