ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ.. ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఆయన ఎక్కువగా రాజకీయం కాకుండా.. గత నాలుగైదు రోజులుగా.. కరోనా మీద మాట్లాడుతున్నారు. కరోనా గురించి.. ప్రభుత్వ తీరును విమర్శించడమే కాకుండా.. ఆయన ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నంత తేలికగా పరిస్థితి లేదని.. ప్రపంచం అంతా వణికిపోతోందని చెబుతూ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పార్టీ పరంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపనకు మద్దతుగా అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. అయితే.. చంద్రబాబు ఈ తరహా పనులు చేయడం.. ఏపీ సర్కార్ మంత్రులకు నచ్చడం లేదు. ప్రెస్మీట్ పెట్టి.. విమర్శలు గుప్పించేస్తున్నారు.
మంత్రి కన్నబాబు.. చంద్రబాబు కరోనా ప్రకటనలపై విమర్శలు గుప్పించడానికే ప్రెస్మీట్ పెట్టారు. చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని వాపోయారు. కరోనాపై చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండదని .. ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని విజ్ఞప్తి చేశారు. తాము పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదు కాబట్టి… చంద్రబాబు కూడా తన వైపు నుంచి ఎలాంటి ప్రకటనలు చేయవద్దన్నట్లుగా.. కన్నబాబు మాటలు ఉన్నాయి. చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారని మంత్రి .. విమర్శిస్తున్నారంటే… ప్రభుత్వం చేయడం లేదనే అనుకోవాలన్న విమర్శలు సహజగానే వస్తున్నాయి.
దేశం మొత్తం హై అలర్ట్ లో ఉంది. కరోనా కారణం.. ఓ రకంగా.. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. కానీ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం కానీ.. శుభ్రతను మరింత చాలెంజింగ్ గా తీసుకునే ప్రయత్నం కానీ ఏపీ సర్కార్ వైపు నుంచి ప్రారంభం కాలేదని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే వాటిపై దృష్టి పెట్టకుండా.. చంద్రబాబు.. కరోనాపై మాట్లాడుతున్నారని.. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారని.. అలా హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నలు గుప్పిస్తూ.. రాజకీయ ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఎవరు చెప్పినా సరే.. అవేర్ నెస్ పెరగడం ముఖ్యమనే సంగతిని మంత్రులు మర్చిపోతున్నారు. చంద్రబాబు మాట్లాడకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.