గతంలోని ఏపీ రాజకీయాల జాడ్యం తెలంగాణకు విస్తరిస్తోంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రత్యర్థి నేతలపై బూతులతో చెలరేగిపోయినట్లుగానే తెలంగాణ నేతలు అదే ధోరణి అవలంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నోరు జారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఏపీ రాజకీయం స్పష్టం చేసినా..తెలంగాణలోని అధికార పార్టీ నేతలు అదే విధానం ఫాలో అవుతుండటం కాంగ్రెస్ కు కోరి కష్టకాలం తెచ్చినట్లేననే అభిప్రాయం వినిపిస్తోంది.
కొండా సురేఖ…కేటీఆర్ ను మాత్రమే కాకుండా ఈ ఎపిసోడ్ లోకి నాగార్జున, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ను పట్టుకురావడంతో అసలు విషయం ట్రాక్ తప్పింది. సమంత విడాకులకు ఎన్ కన్వెన్షన్ కు లింక్ పెట్టేశారు. హీరోయిన్లను మత్తు మందు ఇచ్చి బ్లాక్ మెయిల్ చేశాడని , రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణం అని ఆరోపించి తెలంగాణ రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో అలజడి రేపారు.
కొండా సురేఖ మంత్రి..అయినప్పటికీ అప్పటి వరకు తనపై సానుభూతి కురువగా..ఆమె కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి సమంత, రకుల్ ను ఈ వివాదంలోకి లాక్కురావడంతో సానుభూతి కురిసిన ప్లేసులో అక్షింతలు రాలాయి. కాంగ్రెస్ నేతలు కొంతమంది మినహా ఎవరూ సురేఖ వ్యాఖ్యలకు మద్దతు నిలవలేదు. ఇలాంటి చిల్లర , నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఆమె చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖ మాత్రమే కాదు..ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసినట్లు అయింది. రేవంత్ స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో గత ఐదేళ్లలో ఏపీలో కనిపించిన భాష ..ఇప్పుడు తెలంగాణకు పాకిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీలో పని చేసిన అనుభవం ఉండటంతో ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. అన్ని వైపులా నుంచి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ లు రావడంతో క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చినికి, చినికి గాలివానగా మారిన ఈ విషయంలో కొండా సురేఖ దిగొచ్చి క్షమాపణలు చెప్పినా, విషయం చేయి దాటిందని..ఆమెకు ఉన్న ప్రతిష్టను ఒక్కసారిగా మసకబార్చుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.