తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తోన్న ప్రచారంపై కంటతడి పెట్టుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనకు ఎంపీ రఘునందన్ రావు చెల్లికి ఇచ్చినట్టు చేనేత నూలు దండ వేస్తే..సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు ట్రోలింగ్ చేయడంపై ఆవేదనకు గురయ్యానన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టుగా పోస్టులు పెడుతోందని..ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కొండా సురేఖ.
మీ ఇంట్లో చెల్లిని ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని కేటీఆర్ ను ప్రశ్నించారు కొండా సురేఖ. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తన పట్ల చేస్తోన్న ప్రచారాన్ని కేటీఆర్ తల్లికి , చెల్లికి చూపించాలని.. వాళ్లు కరెక్ట్ అంటారా? అని నిలదీశారు. నీకూ చెల్లి ఉంది కదా.. ఆమె జైలుకు వెళ్తే మేం పోస్టులు పెట్టామా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మహిళలను అవమానించారని… అందుకే బీఆర్ఎస్ ను వీడానని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియాపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశామని.. ఇక సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అటవీ జాతి ప్రవర్తన ఇది .. సిగ్గు , లజ్జ ఉంటే బాజారులో తిరుగు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని లేదంటే బట్టలిప్పించి ఉరికించి కొడుతామని వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో అసహ్యంగా పోస్ట్ పెట్టారు..దీనిని ఎవరైనా సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. మహిళలను అవమానించడం బీఆర్ఎస్ సంస్కృతిగా మారిందన్నారు. బీఆర్ఎస్ భవన్ ముందు పద్మశాలీ సోదరులు నిరసన తెలిపితే బీఆర్ఎస్ గుండాలు దాడి చేశాయని మండిపడ్డారు.