హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తాయిలాల పంపిణీని వేగవంతం చేసింది. ఇవాళ కంటోన్మెంట్‌లోని రసూల్‌పురాలో 10,000 ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పేదలందరికీ గూడు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. నాలుగేళ్ళలో హైదరాబాద్‌లో లక్ష పై చిలుకు ఇళ్ళను నిర్మిస్తామని అన్నారు. లక్షా ఎనిమిదివేలమందికి పట్టాలిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించామని, గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చామని అన్నారు. పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్ళలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. పేదవాడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, పైసా తీసుకోకుండా పేదలకు అన్ని సౌకర్యాలతో ఇళ్ళు కట్టిస్తున్నామని అన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని హైదరబాద్ ప్రజలు ఆదరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు నాయని, తలసాని, మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన సాయన్న, పద్మారావ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.