ఆంధ్రప్రదేశ్ లో భాజపా నేతలు కొంచెం ‘డిఫరెంట్’! వారికి కేంద్రం ఏది చెబితే అదే శిరోధార్యం. పార్టీ జాతీయ నాయత్వాన్ని వెనకేసుకుని రావడమే వారి కర్తవ్యం అనే విమర్శలు చాలా ఉన్నాయి. విభజన అనంతరం ఆంధ్రాకు దక్కాల్సిన కేటాయింపులపై వారు కేంద్రంతో చర్చించిందీ లేదు, ఏపీ నాయకులుగా ఇక్కడి ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నమూ లేదు. ట్రాక్ రికార్డు ఇలా ఉంది కాబట్టి… కేంద్ర బడ్జెట్ పై వారి స్పందన సహజంగానే సానుకూలంగా ఉంటుంది. అది కూడా ఏ స్థాయి సానుకూలత అంటే… సొంత రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేంత! ఏపీ భాజపా మంత్రి మాణిక్యాలరావు మాటలు విన్నాక ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందన్నారు మంత్రి మాణిక్యాలరావు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటూ మిత్రపక్షంలో కొందరు మాత్రమే అంటున్నారనీ, వారి ఆలోచనా స్థాయిగానీ బడ్జెట్ ను చూసిన కోణంగానీ కాస్త వేరుగా ఉందన్నారు. బడ్జెట్ ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పోలవరం విషయంలో కూడా చాలామందికి అపోహలు కలిగాయనీ, ఆ తరువాత అన్నీ ఒక్కోటిగా తొలిగిపోయాయి అన్నారు. అదే తరహా బడ్జెట్ పై కొంతమందికి అపోహలు ఉన్నాయనీ, త్వరలో అవి తొలగిపోతాయన్నారు. బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఇతర రాష్ట్రాలు వేరు, ఆంధ్రా వేరు అనేది సరికాదన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రా కూడా ఉంటుందనీ, రైతులకు సంబంధించిన ప్రయోజనాలుగానీ, బీమా పథకం కూడా రాష్ట్ర ప్రజలకు వర్తిస్తుందని తెలుసుకోవాలన్నారు. దేశంలో భాగంగానే ఆంధ్రా ఉంటుందని చెప్పారు! అయితే, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాను ప్రత్యేకంగా చూస్తామని గతంలో భాజపా చెప్పిన విషయాన్ని మంత్రి ముందు ప్రస్థావిస్తే… ‘అన్ని రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు ఉందా, అన్ని రాష్ట్రాల్లోనూ రాజధానికి డబ్బులిస్తున్నారా, అన్ని రాష్ట్రాల్లోనూ ఇన్ని ఇన్ స్టిట్యూట్ పెట్టారా..? ఇవన్నీ ప్రత్యేకమే కదా. కేంద్రం ప్రత్యేకంగా ఇస్తున్నవే కదా’ అంటూ మంత్రి చెప్పారు.
మంత్రి మాణిక్యాల రావు మాటల్లో ఆంధ్రా ప్రజల వాయిస్ ఏదీ..? అంతా కేంద్రం వాదనేనా..? పోలవరం కడుతున్నారు కరెక్టే… ఈ బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు ఏవీ..? రాజధానికి నిధులు ఇస్తున్నామంటున్నారు కరెక్టే… అరుణ్ జైట్లీ ప్రసంగంలో ఆ ప్రస్థావనేదీ..? విద్యా సంస్థలు కేటాయించారు కరెక్టే… బడ్జెట్ లో వాటికి కేటాయించిన నిధులు ఏపాటివి..? ఆంధ్రాను ప్రత్యేకంగా చూడమంటే… కొన్ని ప్రకటనలు చేసి ఊరుకోవడం కాదు కదా! విభజన చట్టంలోని కొన్ని హామీలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బడ్జెట్ లో కేటాయింపులు కూడా ఉండాలి కదా. అయినా… ఇతర రాష్ట్రాలతో ఆంధ్రా సమానం అని చెప్పడానికి ఈయన కేంద్రమంత్రి కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి..! రాష్ట్రం బాధను మాట్లాడాలి, రాష్ట్ర అవసరాలను మాట్లాడాలి. అంతేగానీ, భాజపా గొంతుతో మాట్లాడితే ఏమనుకోవాలి..? బడ్జెట్ ను ఇంకా అర్థం చేసుకోవాలనీ, అప్పుడు అపోహలు పోతాయని ఏపీ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు చెబుతూ ఉండటం కాస్త విడ్డూరంగా ఉంది.